Begin typing your search above and press return to search.

రామ్మోహన్‌ నాయుడికి వాళ్లు జలక్ ఇచ్చారట..

By:  Tupaki Desk   |   16 April 2019 4:58 AM GMT
రామ్మోహన్‌ నాయుడికి వాళ్లు జలక్ ఇచ్చారట..
X
టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ సీటు ఈసారి జారీపోతుందా..? అనే చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ పోటీగా నిలిచారు. ఇక్కడ పార్టీల మధ్య పోరు కంటే కులాల మధ్యే అభ్యర్థుల గెలుపోటములు ఉంటుందని పోలింగ్ సరళిని బట్టి నేతలు దాదాపు నిర్ణయానికి వచ్చారు.. గతంలో జరిగిన ఎన్నికల్లో కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తరువాత కింజారపు ఎర్రన్నాయుడు ఈ నియోజకవర్గం నుంచి గెలవడంతో వెలమల స్థానంగా అవతరించింది.

1996కు ముందు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో కళింగులే ప్రాతినిథ్యం వహించారు. 1996 నుంచి 2009 వరకు టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రన్నాయుడిదే హవా సాగింది. 2009లో కళింగ సామాజిక వర్గంకు చెందిన కిల్లి కృపారాణి కాంగ్రెస్‌ తరుపున విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ కు ఎదురుగాలి వీయడంతో 2014 ఎన్నికల్లో ఆమె పరాజయం చెందారు.

2012లో ఎర్రన్నాయడు మృతిచెందడంతో ఆయన కుమారుడు రామ్మోహన్‌ నాయుడు 2014లో పోటీ చేశారు. ఎర్రన్నాయుడి సానుభూతి, టీడీపీ హవా సాగడంతో ఆయన గెలుపొందారు. దీంతో ఆయన ఈసారి కూడా పోటీ చేశారు. అయితే ప్రస్తుతం కళింగ సామాజిక వర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన గత రెండు పర్యాయులుగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై ఉన్న సానుభూతి, వైసీపీ గాలి వీస్తున్నట్లు వార్తలు రావడంతో శ్రీకాకుళం ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికల వరకు పరిస్థితి వేరే రకంగా ఉన్నా పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే దువ్వాడ శ్రీనివాస్‌ కు కళింగ సామాజిక వర్గం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసిన వారు రామ్మోహన్‌ నాయుడు వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. వెలమలు రామ్మోహన్‌ నాయుడికి మద్దతు పలకగా మిగిలిన కులాల ఓట్లు చీలినట్లు అర్థమవుతోంది. దీంతో ఇక్కడ కులాల మధ్యే ఎన్నికలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కళింగలో కొంత మంది రామ్మోహన్‌ నాయుడు వైపు మద్దతు ఇస్తే పర్వాలేదు, లేకుంటే ఈసారి దువ్వాడ శ్రీనివాస్‌ దే పైచేయి అన్నట్లుగా జిల్లాలో సమీకరణాలు మారాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.