Begin typing your search above and press return to search.

బీజేపీ నుండి రజనీ దూరం జరిగిపోయాడా ?

By:  Tupaki Desk   |   1 Jan 2021 7:00 PM IST
బీజేపీ నుండి రజనీ దూరం జరిగిపోయాడా ?
X
తొందరలో తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పెద్ద ప్లానే వేసింది. అదేమిటంటే అన్నాత్తై రజనీకాంత్ ను మెల్లిగా దువ్వి రాజకీయాల్లోకి తీసుకురావాలని వ్యూహం రచించింది. కుదిరితే బీజేపీలో చేర్చుకోవటం లేకపోతే ప్రత్యేకంగా పార్టీ పెట్టించి చిన్న చిన్న పార్టీలతో కలిసి కూటమి కట్టడం. ఇందులో భాగంగానే రజనీ పుట్టినరోజు నాడు నరేంద్రమోడి శుభాకాంక్షలు చెప్పారు. అమిత్ షా తదితరులు ప్రత్యేకంగా ఫోన్లో శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా తమిళనాడు బీజేపీలోని కీలక నేతలు అదేపనిగా రజనీ ఇంటికెళ్ళి మరీ శుభాకాంక్షలు చెప్పొచ్చారు.

సరి ఇదంతా గతంలో కలిసిపోయింది. కారణాలు ఏవైనా హఠాత్తుగా తన చుట్టూ కమలంపార్టీ ఉచ్చును రజనీ గ్రహించారని తమిళనాడు మీడియా కోడై కూస్తోంది. అందుకనే హఠాత్తుగా రజనీ పొలిటికల్ ఎంట్రీ నుండి విత్ డ్రా అవుతున్నట్లు ప్రకటించారని సమాచారం. బీజేపీ కబంధ హస్తాల్లో ఇరుక్కోవటం రజనీకి ఇష్టం లేదట. తనచుట్టూ కమలం నేతలు గట్టి ఉచ్చును అల్లుతున్న విషయాన్ని రజనీ గ్రహించారట.

ఇదే సమయంలో అనారోగ్యం పాలవ్వటం కూడా కలిసివచ్చిందట. దాంతో వెంటనే రజనీ ఎటువంటి మొహమాటం లేకుండా ప్లేటు తిప్పేశారు. హఠాత్తుగా రజనీ తీసుకున్న నిర్ణయంతో బీజేపే నేతలకు ఒక విధంగా షాక్ తగిలిందనే చెప్పాలి. తమిళరాజకీయాల్లో కాలు మోపాలని బీజేపీ దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్న కారణంగా కనీసం ఒక్క ఎంఎల్ఏని కూడా గెలిపించుకోలేకపోతోంది.

ఈసారి ఎలాగైనా మంచి ఫలితాలు సాధించాలని కమలం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందుకు అనువైన మార్గాలను పరిశీలించినపుడు రజనీకాంత్ ను ముందుపెట్టి షో రన్ చేయటం ఒక్కటే మార్గంగా కనిపించిందట. అందుకనే చాలా కాలం నుండి రజనీతో సంబంధాలను కలుపుకునే ప్రయత్నాలు చేసింది. రజనీతో నేరుగా పొత్తుపెట్టుకోవాలని లేకపోతే చిన్న పార్టీలతో జట్టుకట్టాలని గట్టిగా ప్రయత్నాలు చేసింది.

ఎందుకంటే ప్రధాన పార్టీలైన డీఎంకే, ఐఎఏడీఎంకేలు బీజేపీతో కలవటానికి సుముఖంగా లేవు. ఏఐఏడీఎంకే మొదట్లో పొత్తుకు రెడీ అన్నా తాజాగా అధికారంలో మాత్రం భాగస్వామ్యం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దాంతో కమలంపార్టీకి ఇపుడు ఏమి చేయాలో తోచటం లేదు. సరే ఎవరి విషయం ఎలాగున్నా రజనీకాంత్ మాత్రం బీజేపీకి దూరంగా జరిగారనే చెప్పకతప్పదు.