Begin typing your search above and press return to search.

యూపీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 6:30 AM GMT
యూపీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ?
X
దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా ? ఇపుడిదే విషయమై అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆ ఫిక్సింగ్ కూడా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కు జరిగినట్లు అనుమానాలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కీలకమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి మౌనంగా ఉండటమే మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలకు కారణమవుతోంది.

ఏడెనిమిది నెలల క్రితం వరకు అధికారంలోకి రాబోయేది తామేనంటూ నానా గోల చేసిన మాయావతి హఠాత్తుగా ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవరికీ అంతుబట్టడంలేదు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి నాలుగు సార్లు సీఎంగా చేసిన మాయావతి పాత్ర రాబోయే ఎన్నికల్లో చాలా కీలకంగా ఉంటుందనే అందరూ అనుకున్నారు. ప్రత్యర్థులను ఢీ అంటే ఢీ అనే మనస్తత్వం ఉన్న మాయావతి మిగిలిన వారికి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే అనుకున్నారు.

అయితే తెరవెనుక ఏం జరిగిందో ఏమో అసలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. 2017 ఎన్నికల్లో బీఎస్పీకి 22 శాతం ఓట్లొచ్చాయి. అంతకుముందు 2007లో దళితులు, బ్రాహ్మణులను ఏకంచేసి ఒంటిరిగానే 36 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర కూడా ఉంది. అలాంటిది 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుల్లో పోటీచేసినా చాలా నియోజకవర్గాల్లో మూడోస్ధానానికి పరిమితమైపోయారు. 2022 ఎన్నికల్లో అధాకారం అందుకోవటమే టార్గెట్ గా బాగా యాక్టివ్ గానే ఉన్నారు ఒకపుడు.

అయితే రాజకీయ విశ్లేషకుల ప్రకారం బీజేపీతో మాయావతి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ+మాయావతి ఇద్దరికీ కామన్ ప్రత్యర్ధి అయిన అఖిలేష్ ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఇద్దరు చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం ఎక్కడా అధికారికంగా కనబడటం లేదు. బ్రాహ్మణ, ఎస్సీల ఓట్లను బీజేపీకి మళ్ళించటమే ధ్యేయంగా మాయావతి పనిచేస్తున్నారనే ఆరోపణలైతే పెరిగిపోతున్నాయి. అయితే ప్రయాంకగాంధి కూడా పై రెండు సామాజికవర్గాల పైనే దృష్టి పెట్టారు.

కాబట్టి తెరవెనుక ఒప్పందంతో బ్రాహ్మణ, ఎస్సీల ఓట్లను బీజేపీకి మళ్ళింకాలని మాయావతి అనుకున్నా కాంగ్రెస్ కారణంగా సాద్యమయ్యేట్లు లేదు. అయితే కాంగ్రెస్ ప్రభావం ఎంతన్నది స్పష్టంగా తెలియటంలేదు. ఏదేమైనా అఖిలేష్ ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ-మాయావతి ఏకమయ్యారనే ఆరోపణలైతే వినబడుతున్నాయి. దీంతో బీజేపీ-మాయావతి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.