Begin typing your search above and press return to search.

ఎదురుదెబ్బలతో కేసీఆర్ రూటు మారిందిగా?

By:  Tupaki Desk   |   10 Feb 2021 11:00 AM IST
ఎదురుదెబ్బలతో కేసీఆర్ రూటు మారిందిగా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దర్పమే వేరుగా ఉంటుంది. తనకు తానుగా ఇష్టమైతే తప్పించి.. ఎవరిని కలిసే అవకాశం ఇవ్వని కేసీఆర్.. అదే సమయంలో తనకు నచ్చాలే కానీ గంటల కొద్దీ కబుర్లు పిలిపించి మరీ చెప్పేస్తారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదన్న దానికి నిదర్శనంగా కేసీఆర్ కనిపిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసేవారు లేకపోలేదు. ప్రజానాయకుడు అనేవాడు.. ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించే గులాబీ బాస్ తీరు రోటీన్ కు భిన్నమని చెప్పక తప్పదు.

తన రూటు సపరేటు అన్నట్లుగా ఉండే ఆయన చాలా విషయాన్ని విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఉప ఎన్నికలు.. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల విషయంలో తాను కాలు బయటకు పెట్టకుండానే విజయం సాధించాలన్నట్లుగా వ్యవహరించే తీరు.. మిగిలిన అధినేత తీరుకు కాస్త భిన్నం. నిజానికి ఈ ఓవర్ కాన్ఫిడెన్సే.. కేసీఆర్ కొంప ముంచటమే కాదు.. తెలంగాణలో బీజేపీ చెలరేగిపోవటానికి కారణమైందని చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తీసుకున్ననిర్ణయాలే టీఆర్ఎస్ ఓటమికి కారణమని చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాల కంటే కూడా తనకు నచ్చిందే చేయాలన్న మొండితనమే దెబ్బ తీసిందని చెబుతారు.

నిజానికి అభ్యర్థి ఎంపికలో మిగిలిన వారి మాటకు ఏ మాత్రం విలువ ఇచ్చినా.. తనకు తాను ప్రచార గోదాలో దిగినా పరిస్థితి మరోలా ఉండేదని చెబుతారు. గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన ఎన్నికల్లోనూ కేసీఆర్ వ్యవహరించిన తీరు.. ఆయన చేసిన ప్లానింగ్ బీజేపీకి కలిసి వస్తే.. టీఆర్ఎస్ ను దెబ్బ తీసింది. అప్పటివరకు తన బలాన్ని ఎక్కువగా ఊహించుకునే కేసీఆర్.. తర్వాత నుంచి కాస్త నేలకు దిగి ఆలోచించటం షురూ చేశారని చెబుతున్నరు. ఈ కారణంతోనే త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందు..భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ఉప ఎన్నిక వేళ.. ఇలా సభల్ని నిర్వహించటం సీఎం కేసీఆర్ కు పెద్ద ఇష్టం ఉండదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కానీ.. మారిన రాజకీయ సమీకరణాల్ని గుర్తించిన కేసీఆర్ మేల్కొన్నారని ఆయన గతంలో మాదిరి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో లేరని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. ఈ రోజు హాలియాలో జరిగే బహిరంగ సభకు భారీగా జనసమీకరణకు జిల్లానేతలకు టార్గెట్ పెట్టారంటున్నారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకున్నా.. ముందు నుంచే గ్రౌండ్ వర్కు చేయటం.. శ్రేణుల్ని అలెర్టు చేయటానికి తాజా బహిరంగ సభ అవకాశాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. రోటీన్ కు భిన్నంగా గులాబీ బాస్ తీరు మారిందని చెప్పక తప్పదు.