Begin typing your search above and press return to search.

పీకే పోటీ!... వంద సీట్ల‌కే ప‌రిమిత‌మా?

By:  Tupaki Desk   |   27 Jan 2019 4:03 PM IST
పీకే పోటీ!... వంద సీట్ల‌కే ప‌రిమిత‌మా?
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇక ఎంతో స‌మ‌యం లేదు. మ‌రో మూడు నెలల్లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వ‌చ్చే నెల‌లోనే జారీ కానుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే ఇంకో నెల రోజుల్లో ఆయా పార్టీలు త‌మ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకోవాల్సిందేన‌న్న మాట‌. ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగే పార్టీల విష‌యానికి వ‌స్తే... బ‌రిలో ఎన్ని పార్టీలు ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీల మ‌ధ్యేన‌న్న‌ది ఇప్ప‌టికే సుస్ప‌ష్టం. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో తానే కీల‌కం అంటున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాటేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... అస‌లు ఆయ‌న పోటీ చేసే స్థానాలు ఎన్నో తెలిస్తే... ఆయ‌న ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుంద‌న్న విష‌యం తేల్చ‌వ‌చ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ ఎన్నిక‌ల్లో సింగిల్ గానే బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్ల‌లోనూ త‌మ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని చెప్పారు. అయితే ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలు, ఉభ‌య గోదావ‌రి జిల్లాలు మిన‌హా ప‌వ‌న్ పెద్ద‌గా దృష్టి సారించిన జిల్లాలు లేవ‌నే చెప్పాలి. ఇత‌ర అభ్య‌ర్థుల సంగ‌తి ఎలా ఉన్నా... తాను ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌న్న విష‌యాన్ని కూడా ప‌వ‌న్ ఇప్ప‌టిదాకా చెప్ప‌నేలేదు.

స‌రే పీకే క్లారిటీ ఇవ్వ‌లేదు గానీ... ఎన్నిక‌ల‌పై ఆయ‌న విభిన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని ఇప్పుడు స‌రికొత్త వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా స‌మ‌యం లేక‌పోవ‌డం, అంత‌కు ముందు కూడా తాను పెద్ద‌గా రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించ‌క‌పోవ‌డం, పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ ఇప్పుడు ఈ సరికొత్త వ్యూహానికి ప‌దును పెట్టిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహం ప్ర‌కారం రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాలు కాకుండా ఓ వంద మేర స్థానాల్లో త‌న అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఎంపిక కూడా చాలా ప‌క‌డ్బందీగా జ‌ర‌గాల‌న్న‌ది ప‌వ‌న్ వాద‌న‌గా వినిపిస్తోంది. ఎలాగూ తాను 175 స్థానాల్లో పోటీ చేసినా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌ద‌ని, గుడ్డిగా వెళ్లేదాని క‌న్నా... కాస్తంత తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తే.. అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు విప‌క్ష పార్టీ వైసీపీకి కూడా చెక్ పెట్టే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న బ‌లంగా విశ్వ‌సిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే టీడీపీతో పాటు వైసీపీ బ‌ల‌హీనంగా ఉన్న స్థానాలు, ఆ రెండు పార్టీలు పోట్లాడుకుంటే త‌న‌కు ఫ‌లితం ద‌క్కే స్థానాలు ఏవ‌న్న విష‌యంపై ప‌వ‌న్ ఇప్పుడు ప్ర‌ధానంగా దృష్టి సారించార‌ట‌.

ఈ త‌ర‌హా స్థానాల్లో పోటీ చేయ‌డం ద్వారా మెజారిటీ సీట్ల‌ను సాధించ‌డంతో పాటుగా ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయినా.. కింగ్ మేక‌ర్‌ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయ‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఈ స్థానాలు ఎక్క‌డున్నాయ‌న్న విష‌యంపై ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయిన ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌తో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని దాదాపుగా అన్ని స్థానాల‌ను త‌న‌కు అనుకూల‌మైన నియోజ‌కవ‌ర్గాలుగా ఎంచుకున్నార‌ట‌. ఇక రాజ‌కీయంగా కీల‌కమైన జిల్లాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌దేసీ సీట్ల చొప్పున పోటీ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. మ‌రి రాయ‌ల‌సీమ‌లో ఏ మేర‌కు పోటీ చేయాలన్న విష‌యంపై ఇంకా ఓ స్ప‌ష్ట‌త‌కు రాని ప‌వ‌న్‌.. త్వ‌ర‌లోనే అక్కడ కూడా దృష్టి సారించ‌నున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. అంటే... మొత్తంగా 175 స్థానాలు అని చెప్పిన ప‌వ‌న్‌... ఇప్పుడు కేవ‌లం 100 సీట్లు అంటున్నారంటే.. వ్యూహం కాస్తంత ప‌క‌డ్బందీగానే వెళుతున్న‌ట్టా? లేదంటే స‌రిప‌డినంత మంది అభ్యర్థుల ల‌భ్య‌త లేక ప‌వ‌న్ ఈ డ్రామా ఆడుతున్నారా? అన్నది చూడాలి.