Begin typing your search above and press return to search.

హైదరాబాద్ 'గ్రేట్ డ్రగ్ సిటీ' గా మారిందా?

By:  Tupaki Desk   |   4 April 2022 4:25 AM GMT
హైదరాబాద్ గ్రేట్ డ్రగ్ సిటీ గా మారిందా?
X
నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో రాజకీయ నాయకులకు మించినోళ్లు ఉండరు. నరం లేని నాలుక అన్నట్లుగా.. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం.. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని బద్నాం చేయటం కోసం దేనికైనా సై అన్నట్లుగా వారి తీరు ఉండటం కనిపిస్తుంది.

పెను సంచలనంగా మారిన రాడిసన్ బ్లూ పబ్ లో డ్రగ్స్ వినియోగం ఎపిసోడ్ కు రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్ వినియోగం హైదరాబాద్ లో పెరిగిన అంశాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో తెర మీదకు తీసుకురావటం.. దానికి కేసీఆర్ సర్కారును నానా మాటలు అనే కార్యక్రమానికి తెర తీశారు విపక్ష నేతలు.

ఏఐసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దాసోజు శ్రవణ్ సంగతే చూద్దాం. పబ్ లో డ్రగ్స్ దొరికాయన్నంతనే ఆయన విమర్శలు చేయటం మొదలు పెట్టారు. కేసీఆర్ సర్కారు పై విమర్శలు చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని మరో బ్యాంకాక్ గా కేసీఆర్ సర్కారు మార్చిందని మండిపడుతున్నారు.

టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చే నాటికి హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఉండేదని.. కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత గ్రేట్ డ్రగ్ సిటీగా మారిందని ధ్వజమెత్తారు.

అధికార పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలే పబ్బులు.. క్లబ్బులు నడుపుతున్నారని ఆరోపించారు. మాదక ద్రవ్యాల కట్టడి పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. మాదాపూర్.. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఉన్న పబ్బుల్ని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కూడా తొందరపాటుతో కూడుకున్నదే. ఒక మహానగరంలో ఉండాల్సినవన్నీ ఉండాలి. కానీ.. అవి తప్పు చేయకుండా చూడాల్సిన రీతిలో ప్రభుత్వం ప్లానింగ్ చేస్తే సరిపోతుంది.

ఒక సంచలన ఉదంతంచోటు చేసుకున్నప్పుడు రాజకీయం కోసం దాన్ని వాడేయకుండా.. లోపాల్ని తెలివిగా ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. అది మరిచి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని దాసోజు శ్రవణ్ లాంటి వారు ఎప్పుడు గుర్తిస్తారో?