Begin typing your search above and press return to search.

మాతో తెగదెంపులు చేసుకుంటే అంతే.. మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ అరెస్ట్​

By:  Tupaki Desk   |   2 Oct 2020 3:20 PM IST
మాతో తెగదెంపులు చేసుకుంటే అంతే.. మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్  అరెస్ట్​
X
కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ బాదల్​ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఇటీవలే హర్​ సిమ్రత్​ మంత్రి పదవికి రాజీనామా చేశారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా ఎన్డీఏనుంచి బయటకొచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం చండీగఢ్​లో శిరోమణి అకాలీదళ్ భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ ప్రదర్శనకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ కేంద్రమంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల వాణిని వినిపించే నేతలను అరెస్ట్​ చేస్తున్నారని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుంటే బీజేపీ మాత్రం కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తే మరింత ఎక్కువవుతుందని హెచ్చరించారు. అకాలీదళ్ గురువారం వేర్వేరుగా మూడు చోట్ల రైతు ర్యాలీలను నిర్వహించింది. ఎన్డీయే ప్రభుత్వపతనం ఖాయమని ఈ సందర్భంగా ప్రసంగించిన రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఒకవైపు రైతుల శ్రేయస్సు కోసం నూతనంగా బిల్లు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా.. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్ర బిల్లులకు వ్యతిరేకత వస్తోంది. వివిధ రైతుసంఘాలు కేంద్రం తీరును తప్పుబడుతున్నాయి.