Begin typing your search above and press return to search.

హర్షకుమార్‌ తనయుడి మరో ఘనకార్యం..!

By:  Tupaki Desk   |   29 Jun 2015 11:47 AM IST
హర్షకుమార్‌ తనయుడి మరో ఘనకార్యం..!
X
గతంలో కూడా పలు వివాదాల్లో హర్షకుమార్‌ తనయుల పేర్లు వినిపించాయి. ప్రత్యేకించి సమైక్యాంధ్ర ఉద్యమం ధాటిగా కొనసాగుతున్నప్పుడు ఆ ఉద్యమకారులపై హర్షకుమార్‌ ఫ్యామిలీ దాడులకు పాల్పడింది. అప్పట్లో ఎంపీ హోదాలో ఉన్న ఆయనను నిలదీయడానికి వెళ్లిన సమైక్య ఉద్యమకారులపై హర్షకుమార్‌ తనయులు దాడులు చేశారనే ఆరోపణలున్నాయి. మరి అలాంటి అహంకారానికి తగిన ప్రతిఫలం చెల్లించుకొన్నారు. హర్షకుమార్‌ మళ్లీ ఎంపీగా గెలవలేకపోయాడు. మాజీ ఎంపీగా ఇంట్లో కూర్చొన్నాడు.

అయితే ఆయన తనయులు మాత్రం ఇంకా తగ్గలేదు. తాజాగా మరో సారి ఈ మాజీ ఎంపీగారి తనయుడు ఒకరు వార్తల్లోకి వచ్చాడు. అది కూడా ఒక యాక్సిడెంట్‌ చేసి. రాజమండ్రి సమీప ప్రాంతంలో హర్షకుమార్‌ తనయుడి కారు ఢీ కొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. మోటర్‌బైక్‌ మీద వస్తున్న వారిని హర్షకుమార్‌ తనయుడి కారు ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో మోటర్‌సైక్లిస్ట్‌లు తీవ్రగాయాలపాలయ్యారు.

కారు అతివేగంతో వచ్చిందని.. డివైడర్‌ను ఢీ కొట్టి తర్వాత మోటర్‌సైకిల్‌ను ఢీ కొట్టిందని.. దీంతో దానిపై వస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. డివైడర్‌కు ఢీ కొట్టడంతో కారు ముందు చక్రం ఊడిపోయిందంటే ప్రమాద తీవ్రత స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

డివైర్‌ను, మోటర్‌సైకిల్‌ను ఢీ కొట్టిన అనంతరం కారు వంద మీటర్ల ముందుకు వెళ్లి ఆగినట్టుగా తెలుస్తోంది. అయితే కారులోని వారెవరికీ గాయాలు కాలేదని.. యాక్సిడెంట్‌ అనంతరం హర్షకుమార్‌ తనయుడు సుందర్‌ అతడి స్నేహితులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని హర్షకుమార్‌ సందర్శించాడు. ప్రమాద వివరాలను తెలుసుకొన్నాడు. బాధితులకు అయితే గాయాల తీవ్రత ఎక్కువగానే ఉందని.. తెలుస్తోంది.