Begin typing your search above and press return to search.

ముద్రగడను సెంట్రల్ జైల్లో పెట్టేయండి!

By:  Tupaki Desk   |   9 Oct 2017 6:11 AM GMT
ముద్రగడను సెంట్రల్ జైల్లో పెట్టేయండి!
X
కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం సాగిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించ‌డం...ఇంట్లోనే నిర్బంధించడం - వేలాది మంది పోలీసులను ఆయన ఇంటి చుట్టూ కాపలా పెట్టించడం వంటి చ‌ర్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం తీరుపై ప‌లు వ‌ర్గాల్లో విస్మ‌యం వ్య‌క్తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జాస్వామ్య రూపంలో పాద‌యాత్ర చేస్తుంటే అడ్డుకోవ‌డం ఎందుక‌నే భావ‌న‌ను చాలామంది వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇలాంటి కామెంట్ల‌కు తోడుగా తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత‌ - మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. ముద్ర‌గ‌డ ఇంటి చుట్టూ మ‌నుషుల‌ను పెట్ట‌డం, ఆయ‌న్ను నిర్భందించ‌డం వంటివి ఖర్చుతో కూడుకున్న పనని పేర్కొంటూ దానికి బదులుగా ముద్రగడను అరెస్టుచేసి సెంట్రల్ జైల్లో పెట్టేస్తే ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వానికి సూచిస్తున్నామని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తులందరినీ జైల్లో పెట్టేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన‌ని వ్యాఖ్యానించారు.

వేలాది మంది పోలీసులతో నిత్యం ముద్రగడ ఇంటి ముందు కాపలా పెట్టి గృహ నిర్బంధం చేయడం - బందోబస్తుకు వేలాది మంది పోలీసులను వినియోగించడంవల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఖర్చవుతోందని, ముద్రగడను జైల్లో పెట్టేస్తే ప్రభుత్వానికి పోలీసులను బాధపెట్టే పరిస్థితి కూడా ఉండదని హ‌ర్ష‌కుమార్ అన్నారు. తన 32 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ దేశంలోనూ ఇటువంటి నిర్బంధ కాండ చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కులను తీవ్రంగా హరిస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాపై కూడా లేనంత నిర్బంధకాండను ముద్రగడపై ప్రభుత్వం విధిస్తోందన్నారు. ఏ దేశంలో ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రగడపై విధిస్తున్న నిర్బంధ కాండను చవిచూసి ఉండరని హర్షకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గతంలో ముద్రగడను రాజమహేంద్రవరం ఆస్పత్రిలో పెట్టినపుడు రోగులను కూడా ఆస్పత్రికి వెళ్లకుండా నిర్బంధించడం స్థానిక ప్రజలు మర్చిపోలేరన్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ఆలోచించకుండా అణచివేయడానికి చూస్తోందని, ఇది సరికాదన్నారు.

రాష్ట్రంలో లోపభూయిష్టమైన పరిపాలన జరుగుతోందని, రానున్న ఎన్నికల్లో ఎటువంటి దుర్గతి పడుతుందో చూసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని హ‌ర్ష‌కుమార్ అన్నారు. ముద్రగడ అంటే ప్రభుత్వానికి ఎందుకింత భయమో అర్ధం కావడం లేదని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసినపుడు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. ఎవరో దుష్టశక్తులు చేసిన పనికి ముద్రగడే రైలు తగులబెట్టారనడం సరికాదని, ఒకవేళ రైలు తగలెట్టేశారని తేలితే చర్యలు తీసుకోవాలి గానీ ఇలా నిర్బంధించి వేధించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచక, భయంకర, దుష్టపాలనను అంతంచేయాల్సిన తరుణం ప్రజలకు వస్తోందన్నారు. ముద్రగడ ఉద్యమం వ్యక్తిగతం కాదని, ఆయన సామాజికవర్గం కోసమని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం స్వప్నాల్లో విహరిస్తోందని, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతోందని హర్షకుమార్ చెప్పారు.