Begin typing your search above and press return to search.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి మాట్లాడకుండా 'డిక్లరేషన్' మీద హరీశ్ ట్వీట్లా?

By:  Tupaki Desk   |   7 May 2022 7:28 AM GMT
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి మాట్లాడకుండా డిక్లరేషన్ మీద హరీశ్ ట్వీట్లా?
X
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ సక్సెస్ కావటం.. ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించటం.. అందులో రైతులకు.. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ సిద్ధం చేసిన డిక్లరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికలకు తమ డిక్లరేషన్ ద్వారా తమ ఎజెండా ఏమిటన్న విషయాన్ని కాంగ్రెస్ స్పష్టం చేయటంతో పాటు.. మిగిలిన రాజకీయ పార్టీలకు సైతం రోడ్ మ్యాప్ ఎలా ఉండలన్న దానిపై దిశా నిర్దేశం చేసిందని చెప్పాలి.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించటంతో పాటు.. వ్యవసాయంతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని.. కష్టాల్ని అధిగమించేందుకు వీలుగా వరంగల్ డిక్లరేషన్ ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ మీదా.. రాహుల్ సభ మీదా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రియాక్టు అయ్యారు. ఆయన చేసిన ట్వీట్లు చూస్తే.. వరంగల్ డిక్లరేషన్ ఆయన్ను.. ఆయన పార్టీని భారీగానే డిస్ట్రబ్ చేసినట్లుగా కనిపిస్తోంది.

'ఎయిర్ పోర్టులో దిగి.. ఇవ్వాల ఏం మాట్లాడాలి. సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రైతుల గురించి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పని చేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే' అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ను చూస్తే.. టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సొంతమైన గడుసుదనం కనిపిస్తుంది. ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ మాట్లాడినట్లుగా చెప్పిన మాటలు.. ఎక్కడివి? హరీశ్ కు ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన వీడియో ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. రాహుల్ ను డ్యామేజ్ చేసేలా ఉండే ఈ వ్యాఖ్యల పరమార్థం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే మరోట్వీట్ లో డిక్లరేషన్ మీద తనకున్న ఆగ్రహాన్ని ఆయన బయటపెట్టేసుకున్నారు. 'రాహుల్ గాంధీగారూ.. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ చైతన్యవంతుడైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు' అంటూ ఇంకో ట్వీట్ లో తాను చెప్పాల్సిన మాటల్ని తెలంగాణ ప్రజానీకం పేరుతో చెప్పేశారు హరీశ్.

రాజకీయంలో ఇలాంటివి కామనే అయినా.. రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా వ్యవహరిస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉండగా.. తనకు ఏ మాత్రం సంబంధం లేని శాఖ అంశాల్ని హరీశ్ మాష్టారు మాట్లాడం ఏమిటి? పంజాబ్ ఎన్నికలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రావటానికి కారణం ఏమిటన్న విషయం అందరికి తెలిసినప్పుడు.. ఆ విషయాన్ని తాజాగా ప్రస్తావించటం చూస్తే.. వరంగల్ డిక్లరేషన్ హరీశ్ ను బాగానే డిస్ట్రబ్ చేసినట్లుగా చెప్పక తప్పదు.