Begin typing your search above and press return to search.

ఈసారి రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంటుందో చెప్పేసిన హరీశ్

By:  Tupaki Desk   |   12 March 2021 4:31 AM GMT
ఈసారి రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంటుందో చెప్పేసిన హరీశ్
X
మరి కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. బడ్జెట్ సమావేశాల్ని నిర్వహించే రోజు దగ్గరకు వచ్చేస్తున్న వేళ.. దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. దీనిపై తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్. ఈసారి బడ్జెట్ పాజిటివ్ గా ఉంటుందని చెప్పారు. ఎలాంటి కోతలు ఉండబోవన్న ఆభయాన్ని ఇచ్చిన ఆయన.. జనవరి ముందు వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అస్పష్టత ఉండేదని.. ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నారు.

జనవరి నుంచి స్పష్టత వచ్చేసిందని.. రెండు మూడు నెలలుగా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైనట్లుగా చెప్పారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. ఆర్థిక వృద్ధి బాగా ఉందని చెప్పిన హరీశ్.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా బడ్జెట్ రూపకల్పన సాగిందన్నారు. గత ఏడాది నెకొన్న కరోనా పరిస్థితుల కారణంగా రుణమాఫీ.. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవటానికి ఆర్థిక సాయం లాంటి కార్యక్రమాల్ని చేపట్టలేకపోయామని చెప్పారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదన్నారు.

టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎవరూ వెళ్లరన్న హరీశ్.. ఆ విషయంలో బీజేపీనేతలు పగటి కలలు కంటున్నట్లుగా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే.. బీజేపీ నేతలు చెప్పే మాటలన్ని ఉత్త ప్రగల్భాలని తేలిపోతాయన్నారు. బీజేపీ విమర్శలకు తాము అదే స్థాయిలో సమాధానం చెప్పగలమని.. విలువలు పాటిస్తుండటంతో సంయమనాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల వివరాల్ని తాను మండలిలో స్వయంగా చెబితే.. అందుకు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చప్పట్లు కొట్టిన వైనాన్ని గుర్తు చేయటం గమనార్హం. రాష్ట్రంలో తమ స్థానంలో బీజేపీ ఉండి ఉంటే.. ఈపాటికి టీఆర్టీసీని అమ్మేసి ఉండేవాళ్లని హరీశ్ ఆరోపించారు. బీజేపీ వాళ్లది అమ్మకమని.. తమది మాత్రం నమ్మకమంటూ అంత్యప్రాసలతో అదరగొట్టేశారు హరీశ్.