Begin typing your search above and press return to search.

హరీశ్ అగ్రహానికి గురైన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   16 Oct 2015 11:11 AM IST
హరీశ్ అగ్రహానికి గురైన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే
X
సాగునీటి ఇంజినీర్ పై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న అదిలాబాద్ బెల్లంపల్లి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తన వాదనను వినిపిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బిల్లుల మంజూరు విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. సంబంధిత అధికారిని తన వద్దకు పిలించుకున్న ఎమ్మెల్యే బూతులు తిట్టేయటమే కాదు.. చెంపలు వాయించేయటంపై సదరు అధికారి మీడియా సమావేశం పెట్టి వివరించటం.. వేదనతో రోదించటం లాంటివి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తటం.. అధికారికి అండగా సాగునీటి శాఖా సిబ్బంది నిలవటంతో.. అధికారపక్ష ఎమ్మెల్యే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా వివాదం నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి శాఖామంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. అసలేం జరిగిందన్న విషయానికి సంబంధించి తన వాదనను వినిపించినట్లు చెబుతున్నారు.

అయితే.. ఎమ్మెల్యే తనను కలవటానికి ముందే.. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి పెట్టుకున్న హరీశ్ రావు.. ఎమ్మెల్యే వాదనను అసాంతం విన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య చెప్పిందంతా విన్న తర్వాత.. అధికారి పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును తప్పు పట్టటమే కాదు.. అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పద్ధతి మార్చుకోవాలని. లేకపోతే ఇబ్బందులు తప్పవని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అధికారిపై చేయి చేసుకున్న విషయంలో చోటు చేసుకున్న వివాదంలో సొంత పార్టీ ఎమ్మెల్యే తీరుపై హరీశ్ గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ కు సర్ది చెప్పటం ద్వారా ఈ వివాదం నుంచి బయటపడొచ్చన్న ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేకు హరీశ్ నిరాశ మిగిల్చారని చెబుతున్నారు.