Begin typing your search above and press return to search.

ఎలాగైనా మల్లన్న సాగర్ ను పూర్తి చేస్తానన్నారు

By:  Tupaki Desk   |   24 Jun 2016 3:54 PM GMT
ఎలాగైనా మల్లన్న సాగర్ ను పూర్తి చేస్తానన్నారు
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై నెలకొన్ని విమర్శల సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ విపక్షాలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు గరమ్.. గరమ్ అవుతున్నారు. ప్రాజెక్టును తప్పు పడుతున్న కాంగ్రెస్.. టీడీపీ నేతల్ని ఆలేరు.. భువనగిరి ప్రజలు నిలదీయాలన్న ఆయన.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణకు సహకరించని నాయకులంతా మల్లన్నసాగర్ ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారంగా తేల్చేశారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా భూ నిర్వాసితులకు చెల్లించిన నష్టపరిహారం ఎంతని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు.

తెలంగాణ ఏర్పాటుకు సహకరించని నాయకులంతా ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు. అదే నిజమైతే.. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కొండా సురేఖ.. తుమ్మల నాగేశ్వరరావు లాంటి ఎంతో మంది నేతల్ని తెలంగాణ అధికారపక్షంలో ఎలా చేర్చుకున్నట్లు? ఉద్యమ కాలంలో ఎవరు ఎట్లా చేసినా.. తమ పార్టీలో చేరి గులాబీ కండువా మెడలో వేసుకుంటే చాలు.. తెలంగాణకు అనుకూలురుగా.. మెడలో గులాబీ జెండా లేనోళ్లంతా తెలంగాణ ద్రోహులవుతారా హరీశ్..? ఇలాంటి వాదన మరీ అన్యాయం కదూ..?