Begin typing your search above and press return to search.

కేంద్రంపై హరీశ్ కు కోపమొచ్చింది

By:  Tupaki Desk   |   1 Sept 2020 11:04 AM IST
కేంద్రంపై హరీశ్ కు కోపమొచ్చింది
X
ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదన్న చందంగా.. విషయం ఏమైనా సరే.. కేంద్రానికి ఇబ్బంది పెట్టటమో.. దాని ప్రయోజనాలకు దెబ్బ తీయటం లాంటివేమైనా చోటు చేసుకోవటాన్ని మోడీ సర్కారు ఏ మాత్రం ఇష్టపడదన్న విషయం తెలిసిందే. కేంద్రంలో బలమైన ప్రభుత్వం కొలువు తీరిన మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెద్దన్న మాదిరి వ్యవహరిస్తామని చెబుతూనే.. రాష్ట్ర ప్రయోజనాల్ని భారీగా దెబ్బ తీస్తున్నారన్న వాదన తరచూ వినిపిస్తోంది.

తాజాగా రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారంపై రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం వాదన ఒకలా ఉంటే.. అందుకు విరుద్ధంగా రాష్ట్రాల వాదన ఉంది. చట్టబద్దంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కేంద్రం ఇవ్వటం లేదని హరీశ్ తప్పు పడుతున్నారు.రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు విరివిగా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందన్న హరీశ్.. మోడీ సర్కారు తమ తీరును మార్చుకోకపోతే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామన్నారు.

అవసరమైతే.. ఈ అంశంలో న్యాయపోరాటం చేస్తామని చెప్పటం గమనార్హం. సోమవారం బీజేపీయేతర ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బెంగాల్.. కేరళ.. ఛత్తీస్గఢ్.. ఢిల్లీ.. తెలంగాణ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. కేంద్రం తీరును మంత్రి హరీశ్ తీవ్రంగా తప్పు పట్టారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూడేళ్లలో సెస్ డబ్బులు మిగిలితే కేంద్రం తీసుకుంటుందని.. తగిలితే మాత్రం రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవాలనటం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు.

పరిహారం కింద రూ.3లక్షల కోట్లు ఇవ్వమని.. రూ.1.65లక్షల కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పటాన్ని తెలంగాణ అంగీకరించదన్నారు. జీఎస్టీలో చేరకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన నిధులకు అదనంగా రూ.25వేల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. గడిచిన మూడేళ్లలో జీఎస్టీ సెస్ కింద రూ.18వేల కోట్లు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే.. రాష్ట్రం తిరిగి పొందింది మాత్రం రూ.3200 కోట్లేనని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టిన హరీశ్.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడతామని స్పష్టం చేశారు.