Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి స‌ర్వే పై హ‌రీశ్ ఏమ‌న్నాడో తెలుసా?

By:  Tupaki Desk   |   9 Dec 2018 10:47 AM GMT
ల‌గ‌డ‌పాటి స‌ర్వే పై హ‌రీశ్ ఏమ‌న్నాడో తెలుసా?
X
ఊరంద‌రిదీ ఒక దారి అయితే ఉలిపిక‌ట్టెది మ‌రో దారి అన్న చందాన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ పై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న స‌ర్వే ఫ‌లితాలు వెలువరించారు. జాతీయ స్థాయి స‌ర్వేల‌న్నీ రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని తేల్చాయి. ల‌గ‌డ‌పాటి మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మిదే అధికార‌మిన చెప్పారు. దీంతో రెండు రోజులుగా ఆయన స‌ర్వే పై భిన్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

తాజా గా టీ ఆర్ ఎస్ ముఖ్య నేత హ‌రీశ్ రావు ల‌గ‌డ‌పాటి స‌ర్వే పై స్పందించారు. ఆయ‌న స‌ర్వే ను తీవ్రంగా విమ‌ర్శించారు. అస‌లు ల‌గ‌డ‌పాటి చేసిన ఏ స‌ర్వే గ‌తంలో నిజ‌మైందో చెప్పాలని ప్ర‌శ్నించారు. నిజానికి గ‌తంలో ల‌గ‌డ‌పాటి అసలు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించ‌ద‌ని చెప్పార‌న్నారు. మ‌రి తెలంగాణ ఏర్ప‌డింది క‌దా అని ప్ర‌శ్నించారు.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుస్తుంద‌ని ల‌గ‌డ‌పాటి చెప్ప‌గా జేడీఎస్ సాయంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసింద‌ని గుర్తుచేశారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలోనూ ఆయ‌న ప‌ప్పులో కాలేశార‌ని చెప్పారు. అక్క‌డ క‌రుణానిధి నేతృత్వంలో ని డీఎంకే అధికారంలోకి వ‌స్తుంద‌ని ల‌గ‌డ‌పాటి చెప్తే పురుచ్చి త‌లైవి జ‌య‌ల‌లిత మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసింద‌ని కూడా గుర్తుచేశారు.

తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటి చేసిన స‌ర్వే పై కూడా ఏమాత్రం విశ్వ‌స‌నీయ‌త లేద‌ని తేల్చిచెప్పారు. ప్ర‌జా కూట‌మి మ‌నిషి కాబ‌ట్టే ఆ కూట‌మికి అనుకూలంగా ఆయ‌న స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించారంటూ విమ‌ర్శించారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో 8-10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తార‌ని ల‌గ‌డ‌పాటి చెప్పిందంతా బూట‌క‌మ‌న్నారు. ఆయ‌న చెప్పిన ఇండిపెండెంట్లెవ‌రూ గెల‌వ‌బోర‌ని అన్నారు. ఇక త‌క్కువ సీట్లు వ‌చ్చినా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయాల‌ని కాంగ్రెస్ పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ అడియాస‌లు కాక త‌ప్ప‌వ‌ని చెప్పారు. తెలంగాణ‌లో టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఏర్ప‌డితే రాజ‌కీయ స‌న్యాసం చేస్తామంటూ ప్ర‌తిజ్ఞ చేసిన కాంగ్రెస్ నేతలు ఇక స‌న్యాసానికి సిద్ధం కావాలంటూ ఎద్దేవా చేశారు.