Begin typing your search above and press return to search.

ఏ మాటకు ఆ మాటే హరీశ్ భయ్యా భలే అడిగేశాడే

By:  Tupaki Desk   |   5 Sep 2022 9:32 AM GMT
ఏ మాటకు ఆ మాటే హరీశ్ భయ్యా భలే అడిగేశాడే
X
మిగిలిన రాజకీయ పార్టీలకు లేని అదృష్టం.. తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ టీఆర్ఎస్ కు దండిగా ఉందనే చెప్పాలి. ఒక కేసీఆర్.. ఒక కేటీఆర్.. మరో హరీశ్ రావు లాంటి కాంబినేషన్ మరే పార్టీలోనూ కనిపించవు. వీరికి అదనంగా కవిత. ఇలాంటి రేర్ కాంబినేషన్ టీఆర్ఎస్ కు మాత్రమే సొంతమని చెప్పాలి. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గులాబీ పార్టీకి కీలకమైన ఈ నలుగురిలో ఉండే కామన్ లక్షణం.. కడుపులో కత్తులు ఉన్నా.. ముఖంలో మాత్రం చిరునవ్వులు చెరగనీయని కుండా ఉంటారు. విడి సమయాల సంగతి ఎలా ఉన్నా.. పార్టీకి సంబంధించి లెక్క తేడా వస్తే.. తమ అంతర్గత విభేదాల్ని పక్కన పెట్టేసి ప్రత్యర్థుల మీద మూకుమ్మడిగా దాడి చేస్తారు.

ముందు బయటోడి సంగతి చూద్దాం. తర్వాత లోపలున్న మన సంగతి చూసుకుందామన్నట్లుగా వారి తీరు ఉంటుంది. తాజాగా కేంద్రం వర్సెస్ తెలంగాణ రాష్ట్రమన్న విషయం తెలిసిందే. ఈడీని బోడీ అని సింఫుల్ గా తేల్చేయటంతో పాటు.. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి చేయటానికి ఇది తెలంగాణ అంటూ తమ బలం ఏమిటన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. రేషన్ దుకాణాల్లో ప్రధాని మోడీ ఫోటో ఎందుకు లేదంటూ కొత్త పాయింట్ బయటకు తీసి.. దాని మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక దశలో జిల్లా కలెక్టర్ ను సైతం చెడామడా అనేసి.. క్లాస్ పీకేయటం తెలిసిందే. దీంతో మంత్రి కేటీఆర్ ఒకవైపు.. ఇంకోవైపు మంత్రి హరీశ్ రావులు మాటల బాణాల్ని సంధించటం షురూ చేశారు. ఇలాంటివి ఇంకెక్కడైనా చూపించండి.. నా దగ్గర కాదన్న రీతిలో నిర్మలమ్మ మరింతగా చెలరేగిపోతూ.. కేంద్రం ఇచ్చే నిధులకు ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరంటూ నిలదీశారు.

దీనికి కౌంటర్ గా పన్నుఆదాయం ఎక్కువగా ఇచ్చే తెలంగాణ రాష్ట్ర సీఎం ఫోటోను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇది కూడా అంత పెద్ద విషయం కాదు కానీ.. తాజాగా నిర్మలమ్మకు కౌంటర్ ఇస్తూ మంత్రి హరీశ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోడీ ఫోటో పెట్టాలని చెబుతున్న నిర్మలమ్మ మాటల్లో ఔచిత్యం లేదన్న హరీశ్ ఆమె తీరుపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర ప్రశ్నను సంధించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ లోని రేషన్ షాపుల్లో ఆయన ఫోటో పెట్టారా? అని ప్రశ్నించారు. ఎందుకంటే.. ఆ సమయంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండటం తెలిసిందే.

తన తాజా ప్రశ్నతో నిర్మలమ్మ నోటి నుంచి మాట రాలేని రీతిలో.. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఆమె మీద భళ్లున చల్లని నీటిని పోసిన రీతిలో హరీశ్ కౌంటర్ ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ప్రత్యర్థులకు నోట మాట రాకుండా పంచ్ లు వేయటంలో హరీశ్ తర్వాతే ఎవరైనా అన్న మాట తాజా ఎపిసోడ్ తో మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.