Begin typing your search above and press return to search.

ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల పై హరీష్ రావు కామెంట్స్

By:  Tupaki Desk   |   22 Sept 2020 12:20 PM IST
ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల పై హరీష్ రావు కామెంట్స్
X
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును హరీష్ రావు ఎండగట్టారు. ఉచిత విద్యుత్ మీటర్లపై కేంద్రం ఇచ్చిన ఆఫర్ ను తాము తిరస్కరించామని హరీష్ రావు తెలిపారు.

కేంద్రం తెచ్చిన ఈ విద్యుత్ మీటర్లను చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. వీటిలో తెలంగాణ కూడా ఒకటి. ఒకప్పుడు వైఎస్ఆర్ అమలు చేసిన ఈ పథకం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోంది. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. వ్యవసాయ బోర్లు, బావులకు ఉచితంగా కరెంట్ ప్రసారం అవుతోంది. అదే కేంద్రం చెప్పినట్టు మీటర్లు పెడితే ఇక బిల్లులు రైతులు కట్టాల్సి ఉంటుంది. ముందస్తుగా మొబైల్ రీచార్జ్ లాగా కూడా రైతులు ముందే కట్టి కరెంట్ ను కొనాల్సి ఉంటుంది. అందుకే దీన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ మీటర్ల ఏర్పాటును తాజాగా హరీష్ రావు తప్పుపట్టారు. రైతులు ఉపయోగించే ప్రతి బావికి, బోరుకు విద్యుత్‌ మీటర్‌ పెట్టాలని.. అందుకు ప్రతిగా తెలంగాణకు రూ.2500కోట్లు, ఏపీకి రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్‌ చేసిందని తెలిపారు.. దాన్ని తెలంగాణ సర్కార్ తిరస్కరించిందని హరీష్ రావు తెలిపారు.

అయితే ఏపీ మాత్రం ఈ ఆఫర్ ను స్వీకరించి అమలు చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏపీ సర్కార్ ది అత్యుత్సాహం అని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తాము అమలు చేయమని.. రైతు సంక్షేమమే ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం భావించిందని... ‘‘మీటర్లు వద్దు, బిల్లులు వద్ద’’ంటూ సీఎం కేసీఆర్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారని తెలిపారు.