Begin typing your search above and press return to search.

కల్వకుంట్ల వారి ఆశలపై 'ఆశా'దెబ్బ!

By:  Tupaki Desk   |   5 Oct 2015 5:30 PM GMT
కల్వకుంట్ల వారి ఆశలపై ఆశాదెబ్బ!
X
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోరిక, ప్రభుత్వం ఆశ అన్నీ ఇప్పుడు తమ ఎమ్మెల్యేల బలాన్ని మరొక సంఖ్య పెంచుకోవడంపై కేంద్రీకృతం అయి ఉన్నాయి. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే స్థానానికి జరగబోయే ఉప ఎన్నికను ఎలాగైనా గెలుచుకోవాలని వారు ముచ్చటపడుతున్నారు. మరీ చిన్నదైన ఎమ్మెల్యే స్థానం ఉప ఎన్నిక తన స్థాయికి తూగదని కేసీఆర్‌ ఇంకా రంగంలోకి దిగడం లేదు గానీ.. తనయుడు కేటీఆర్‌ - అల్లుడు హరీష్‌ తదితర ప్రముఖులు అందరూ 'ఖేడ్‌' గేమ్‌ ను ఇప్పటికే షురూచేసేశారు. అయితే నారాయణఖేడ్‌ లో పొలిటికల్‌ మైలేజీ కోసం కేటీర్‌ అడుగుపెట్టి కార్యక్రమం నిర్వహించే సమయానికి స్థానిక ఆశా కార్యకర్తలు వచ్చి తమ నిరసనలతో ఆయన ఆశల మీద నీళ్లు చిలకరించడం విశేషం.

సాధారణంగా అయితే.. తన కార్యక్రమాల్లో నిరసనలు వెలిబుచ్చే వారి మీద డైరక్టుగా విరుచుకుపడిపోవడంలో కేటీఆర్‌ కూడా తక్కువేమీ కాదు. తమకు సంబంధించిన ఏ కార్యక్రమంలో ఎవ్వరు ఎలాంటి నిరసనలు చేసినా సరే.. మీరు ఆంధ్రోళ్ల చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఆడుతున్నారు. ఆంధ్రోళ్ల పార్టీలు నడిపించినట్లు నడుస్తున్నారు. మీ వెనక ఆంధ్రోళ్లు ఉండి చేయిస్తున్నారు.. అంటూ తలా తోకా లేని వ్యాఖ్యానాలతో విరుచుకుపడిపోవడం ఆయనకు కూడా అలవాటే! కానీ నారాయణఖేడ్‌ లో ఏ ఒక్కరినీ ఏమీ అనలేని పరిస్థితి. సభలో దూకుడుగా వారిని నిందించడానికి గానీ, సభనుంచి బలవంతంగా గెంటేయడానికి గానీ.. వీల్లేని పరిస్థితి. అలాంటి చిన్న చర్య తీసుకున్నా.. అక్కడ జరగబోయే ఉప ఎన్నిక మీద తాము పెంచుకుంటున్న ఆశలు మంటగలుస్తాయని వారికి తెలుసు. అందుకే కేటీఆర్‌ సభలో ఆశాకార్యకర్తలు తమ డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తే.. స్థానిక అధికారులు వారికి సర్దిచెప్పి ఊరడించారే తప్ప తీవ్రంగా స్పందించలేదు.

నారాయణఖేడ్‌ ఉప ఎన్నికను సొంతం చేసుకోవడానికి తెరాసకీలక నాయకులంతా ఇప్పుడు అక్కడ ఫోకస్‌ పెడుతున్నారు. హరీష్‌రావు - పద్మాదేవేందర్‌ రెడ్డి - ఈటల రాజేందర్‌ తదితరులంతా.. ఇప్పటికే మండల పర్యటనలతో కార్యక్రమాలతో బలగాన్ని సమీకరించే పని చేస్తున్నారు. ఇతర పార్టీలనుంచి ఒక ఎమ్మెల్యేమీద ఆకర్ష పథకం ప్రయోగించడం కంటె.. ఉప ఎన్నిక ద్వారా ఒక ఎమ్మెల్యేను తమ పార్టీకే గెలుచుకోవడం ఈజీ అని వారు భావిస్తున్నట్లుంది. మొత్తానికి అలాంటి రసవత్తర రాజకీయ నేపథ్యంలో.. నిరసనల మీద నేతలు ఆగ్రహం వెలిబుచ్చకుండా నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.