Begin typing your search above and press return to search.

మామా అల్లుళ్లు కంగ్రాట్స్ చెప్పుకున్నారు

By:  Tupaki Desk   |   22 Sep 2016 9:59 AM GMT
మామా అల్లుళ్లు కంగ్రాట్స్ చెప్పుకున్నారు
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘పంచాయితీ’ ఒకటి ముగిసింది. తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయటం.. వాటిని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ఇరిగేషన్ శాఖా మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావటం తెలిసిందే.

ఈ సందర్భంగా సహృద్బావ వాతావరణంలో భేటీ జరిగినట్లుగా చెప్పుకున్నారు. ఈ భేటీతో ఇరు రాష్ట్రాల మధ్యనున్న వివాదాల పరిష్కారానికి ఒక అడుగు పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ.. తమ వాదనల్ని సమర్థవంతంగా వినిపించినట్లుగా చెప్పుకోవటం కనిపిస్తుంది. అయితే.. ఈ విషయాన్ని సాపేక్షంగా చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఈ భేటీతో మూడు అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కలిగినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ మూడు అంశాలు సాంకేతికమైనవే తప్పించి.. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్న వాదన వినిపిస్తుంది. పైకి పెద్దరికంగా మూడు అంశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు కనిపించినా.. రానున్న రోజుల్లో.. ఈ అంశాలకు సంబంధించిన తగాదాలు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని.. ఆ విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు.

ఇక.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎలా జరిగిందన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే.. ఏపీతో పోలిస్తే తెలంగాణ సర్కారే తమ వాదనను సమర్థవంతంగా వినిపించిందని చెప్పాలి. ముందునుంచి చెబుతున్నట్లే.. ఈ కౌన్సిల్ భేటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్ రావులు చేసిన హోంవర్క్ ఫలితం ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అర్థం లేనిదన్న విషయం మరోసారి స్పష్టమైంది. అధికారుల ఫీడ్ బ్యాక్ తో నిర్ణయాలు తీసుకోవటం.. బాబుకు సరైన డైరెక్షన్ లో సలహాలు ఇచ్చే వర్గం లేకపోవటంతో బాబు వాదనలు పస లేనివిగా తేలిపోగా.. తెలంగాణ సర్కారు చేసిన వాదనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ఈ వాదనకు బలం చేకూర్చే ఒక ఘటనను ప్రస్తావించక తప్పని పరిస్థితి. కౌన్సిల్ భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్ లు ఇద్దరు ఒకరినొకరు అభినందనలు తెలుపుకోవటం గమనార్హం. ఏపీ లేవనెత్తిన పలు అంశాలకు కౌంటర్ అటాక్ చేయటంలో తాము అనుకున్నట్లే చేశామన్న ధోరణి వారిద్దరిలో కనిపించింది. ఇదొక్కటి చాలు.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏ విధంగా జరిగింది? ఎవరు తమ వాదనల్ని సమర్థంగా వినిపించారన్నది తెలియటానికన్న మాట వినిపిస్తోంది.