Begin typing your search above and press return to search.

బైక్ అయిపోయింది.. పడవలో వెళ్లారు

By:  Tupaki Desk   |   20 July 2015 1:40 AM GMT
బైక్ అయిపోయింది.. పడవలో వెళ్లారు
X
తెలంగాణ మంత్రులు దూసుకెళుతున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించటం.. ఏదైనా సమస్య చోటు చేసుకుందంటే చాటు.. బుల్లెట్ల మాదిరి దూసుకెళుతున్నారు. సమస్య ఏర్పడిన ప్రాంతానికి మందీ మార్బలం లేకుండా.. ఇద్దరుగా వెళ్లటం.. అక్కడి పరిస్థితుల్ని చక్కబెట్టటం కనిపిస్తోంది.

శనివారం గోదావరి పుష్కరాల కోసం భక్తజనం పోటెత్తి.. ట్రాఫిక్ జాం అయిపోతే.. మంత్రులు ఈటెల.. హరీశ్ లు ఇద్దరూ బుల్లెట్ మీద వెళ్లటమే కాదు.. రోడ్డు మధ్యలో ఆగిపోయిన కారును పక్కకు తోసేసి.. ట్రాఫిక్ క్లియర్ చేయటం తెలిసిందే. ఇలా గ్రౌండ్ లెవల్ లో చోటు చేసుకునే ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ఎంతకైనా సరే.. అన్నట్లుగా ముందుకెళ్లటం తెలంగాణ మంత్రుల్లో కనిపిస్తుంది.

నిజానికి శనివారమే కాదు.. అంతకు ముందు కూడా ఖమ్మం జిల్లాలో ట్రాఫిక్ జామ్ అయితే.. మరో తెలంగాణ మంత్రి తుమ్మలతో కలిసిన హరీశ్.. బుల్లెట్ మీద వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఇలా బుల్లెట్ మీద బుల్లెట్టు మాదిరి దూసుకెళుతున్న హరీశ్.. తాజాగా పడవలో కూడా ప్రయాణించారు. పుష్కర ఏర్పాట్లు పరిశీలించేందుకు ఒక రేవు నుంచి మరో పుష్కర ఘాట్ కు పడవలో ప్రయాణించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయా? అన్న అంశాన్ని చెక్ చేశారు. మొత్తానికి బుల్లెట్.. పడవ ఇలా ఏదైనా వెనక్కి తగ్గకుండా.. దూసుకెళ్లటం హరీశ్.. ఈటెల.. తుమ్మల లాంటి వారిలో కనిపిస్తోంది.