Begin typing your search above and press return to search.

మంత్రి పదవి చేపట్టాక ప్రగతి భవన్ కు వెళ్లిన హరీశ్ కు ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   9 Sept 2019 12:36 PM IST
మంత్రి పదవి చేపట్టాక ప్రగతి భవన్ కు వెళ్లిన హరీశ్ కు ఏం జరిగింది?
X
కొన్నిసార్లు అంతే. అప్పటివరకూ జరిగిన దానికి భిన్నమైన పరిణామాలు చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి అనుభవమే హరీశ్ కు తాజాగా ఎదురైందని చెప్పాలి. సరిగ్గా పది నెలల క్రితం కేసీఆర్ కుటుంబ మీడియా సంస్థల్లో హరీశ్ ఫోటో వచ్చేదే కాదు. ఆయనకు సంబంధించిన వార్తల్నినామమాత్రంగా కవర్ చేశామా? అంటే చేశామా? అన్నట్లు ఉండేది.

అలాంటివేళలో.. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక గాలి వీస్తుందన్న మాట బలంగా వినిపించింది. ఆ సమయంలో టాస్క్ మాస్టర్ హరీశ్ ను రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించటంతో.. ఒక్కసారిగా హరీశ్ ఫోటోలు కేసీఆర్ మీడియాలో ప్రముఖంగా అచ్చు కావటం మొదలైంది. అయితే.. తన ఫోటోలు రానప్పుడు కిందామీదా పడనట్లు కనిపించని హరీశ్.. ప్రముఖంగా అచ్చేసిన రోజుల్లోనూ చెలరేగిపోయినట్లుగా.. తనకు తిరుగు లేదన్నట్లుగా ఉండిపోవటం కనిపిస్తుంది.

తనకు ఎలాంటి అనుభవాలు ఎదురైనా.. అన్నింటికి ఒకే తీరును ప్రదర్శిస్తూ.. మేనమామ అంటే వల్లమాలిన అభిమానం తనకుందన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. నిన్నటికి నిన్న మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినంతనే మేనమామ కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేసి తనకున్న విధేయతను చాటి చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రమాణస్వీకారోత్సవానికి ఒకే కారులో వచ్చిన కేటీఆర్.. హరీశ్ లు.. తిరిగి ప్రగతిభవన్ కు వెళ్లే వేళలోనూ ఒకే కారులో వెళ్లటం విశేషం.

అంతేనా.. అన్నింటికి మించి మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వచ్చిన కేటీఆర్ కు ఆయన సోదరి కవిత.. సతీమణి శైలిమాలు తిలకం దిద్ది.. హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతం కేటీఆర్ ఒక్కరికే కాదు.. హరీశ్ రావుకు కూడా చేయటం పలువురి ఆసక్తిగా చర్చించుకోవటం కనిపించింది. ఈ మొత్తం ఫ్రేమ్ లో హరీశ్ సతీమణి మాత్రం కనిపించకుండా ఉండటం గమనార్హం. ఏమైనా.. ప్రగతిభవన్ వద్ద హరీశ్ కు పలికిన ఘన స్వాగతం ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేస్తుందనటంలో సందేహం లేదు.