Begin typing your search above and press return to search.

పదవి కంటే ఉద్యమ జీవితమే బాగుందట!

By:  Tupaki Desk   |   4 April 2017 6:00 AM IST
పదవి కంటే ఉద్యమ జీవితమే బాగుందట!
X
టీఆరెస్ సాగించిన తెలంగాణ ఉద్యమం ఒక రోజు రెండు రోజులది కాదు.. నెల, ఏడాదిదీ కాదు. ఏకంగా పన్నెండేళ్ల ఉద్యమం. ఆ తరువాత ఇప్పుడు అధికారం.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు. మరి పన్నెండేళ్ల ఉద్యమం బాగుందా.. మూడేళ్ల అధికారం బాగుందా అంటే ఎవరైనా ఏం చెబుతారు? ఎవరో సంగతి ఏమో కానీ, తెలంగాణ మంత్రి, టీఆరెస్ నేత హరీశ్ రావు మాత్రం తనకు ఉద్యమకాలంలోని జీవితమే ఎంతో నచ్చిందని చెబుతున్నారు. ఓ ఛానల్ తో మాట్లాడిన ఆయన అప్పటికి, ఇప్పటికీ తేడాలు చెప్పుకొచ్చారు.

ఉద్యమ కాలమే ఎంతో బాగుండేదని.. అప్పుడు ఓ గొప్ప తృప్తి ఉండేదని.. ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా, ఇబ్బందులున్నా, అరెస్టులై జైళ్లకు వెళ్లినా ప్రజలనుంచి వచ్చే స్పందన, దీవెన నాయకుడికి చాలా గొప్పగా ఉంటుందని.. అప్పుడంతా అది అనుభవించామని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. ప్రజల అవసరాలు, అంచనాలు ఎక్కువగా ఉండడంతో రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఎంత కష్టపడి చేయాలన్నా అనుకోని సమస్యలు అడ్డుపడుతుంటాయి. అయితే ఏమేం సమస్యలున్నాయి.. కోర్టులు ఏమన్నాయి అన్నది ప్రజలకు అనవసరం. వారికి తుది ఫలితం కావాలి. అయితే అది చేయలేక.. అనుకున్నది అందించలేక ఓ మానసిక ఒత్తిడి. సంఘర్షణ ఇంకా వారికి ఏదో కావాలేమో... దానికి రీచ్‌ కావడానికి ఇంకా పరిగెత్తాలేమో అన్న ఆలోచనలు వస్తాయి. వీటన్నింటివల్ల ఉద్యమాకారుడిగా ఉన్న సంతృప్తి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొరకడం లేదని హరీశ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓ చట్రంలో పనిచేయాల్సి ఉంటుందని.. ఉద్యమ సమయంలో ఒక్కోసారి చిన్న తప్పటడుగు వేసినా ఉద్యమం కోసమేకదా అని ప్రజలు క్షమించే పరిస్థితి ఉంటుంది కానీ ప్రభుత్వంలో అలా పొరపాటు దొర్లడానికి అవకాశం ఉండరాదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/