Begin typing your search above and press return to search.

ఇప్పుడీ మాట అవసరమా హరిబాబు?

By:  Tupaki Desk   |   1 Jun 2016 7:57 AM GMT
ఇప్పుడీ మాట అవసరమా హరిబాబు?
X
రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఎంపికయ్యే అవకాశం ఉండటం.. ఇందులో భాగంగా ఏపీ అధికారపక్షం ముగ్గురు సభ్యుల్ని ఎంపిక చేయటం తెలిసిందే. తనకున్న బలంతో ముగ్గురు సభ్యుల్ని రాజ్యసభకు పంపే వీలు ఉండటం.. మిత్రపక్షమైన బీజేపీ కోరిన మీదట ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించటం తెలిసిందే. ఈ సీటును కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు కేటాయిస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.

తన రాజ్యసభ సీటును మిత్రుడి కోసం ఇచ్చేసిన సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఏపీకి ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. తన రాజ్యసభ సీటును రైల్వే మంత్రికి ఇచ్చిన నేపథ్యంలో.. ఏపీ కోరుతున్నట్లుగా విశాఖకు రైల్వే జోన్ వ్యవహారం సులువు అవుతుందన్న ఊహాగానాలు విస్తృతంగా వ్యాపించాయి.

ఇదిలాఉంటే.. విశాఖపట్నం ఎంపీ.. బీజేపీ నేత హరిబాబు మాట్లాడుతూ.. సురేశ్ ప్రభును రాజ్యసభ సీటు కేటాయించటానికి విశాఖకు రైల్వే జోన్ కు సంబంధం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు సురేశ్ ప్రభు వెళుతున్నంత మాత్రాన విశాఖకు రైల్వే జోన్ రాదంటూ హరిబాబు చెబుతూ.. తన పదవీ కాలం ముగిసే లోపు విశాఖకు రైల్వే జోన్ వస్తుందని చెప్పారు.

హరిబాబు మాటలు చూస్తుంటే.. విశాఖ జోన్ వ్యవహారం మొత్తం తన ఖాతాలో వేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపొద్దున విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తే అదంతా సురేశ్ ప్రభుకు.. ఆయనకు సీటు కేటాయించిన టీడీపీకి ఎక్కడ వెళుతుందో అన్న భావన హరిబాబు మాటల్లో కనిపిస్తుందని చెప్పాలి. తన వ్యక్తిగత రాజకీయ లబ్థి కోసం ప్రజలు గందరగోళానికి గరి చేసేలా వ్యాఖ్యలు చేయం హరిబాబు లాంటి వారికి సరికాదేమో?