Begin typing your search above and press return to search.

ఇంకో క‌పిల్ దేవ్ వ‌చ్చాడా? గావాస్క‌ర్ హాట్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   8 Sept 2021 1:41 PM IST
ఇంకో క‌పిల్ దేవ్ వ‌చ్చాడా?  గావాస్క‌ర్ హాట్ కామెంట్స్!
X
టీమిండియా త‌ర‌ఫున బ్యాటింగ్ లో రాణించిన‌, రాణిస్తున్న బ్యాట్స్ మెన్ ఉన్నారు. అలాగే బౌలింగ్ లో రాణిస్తున్న బౌల‌ర్లూ ఉన్నారు. గ‌త రెండు ద‌శాబ్దాల్లో టీమిండియా మంచి వికెట్ కీప‌ర్ల‌నూ ప్రొడ్యూస్ చేసింది. అయితే.. ఆల్ రౌండ‌ర్ అనద‌గ్గ ప్లేయ‌ర్ మాత్రం నిఖార్సైన వాడు రాలేద‌ని చెప్పాలి.

ఒక‌టీ రెండు మ్యాచ్ లు మ్యాజిక్ చేసిన వారున్నారు. వారిని మీడియా బాగా కీర్తించింది. ఇర్ఫాన్ ఫ‌ఠాన్ ఇలానే అనిపించుకున్నాడు. అయితే ఫ‌ఠాన్ ఊపు కొన్నాళ్ల‌కే ప‌రిమితం అయ్యింది. చివ‌ర‌కు బ్యాటింగ్ ను ప‌క్క‌న పెట్టి బౌల‌ర్ గా కొన‌సాగే ప్ర‌య‌త్నంలో కూడా ప‌ఠాన్ నిల‌వ‌లేక‌పోయాడు. జ‌ట్టులో చోటు కోల్పోయాడు.

ఇక ఆ మ‌ధ్య హార్ధిక్ ప‌టేల్ ను మ‌రో క‌పిల్ దేవ్ అంటూ కీర్తించారు. హార్డ్ హిట్ట‌ర్ అయిన హార్ధిక్ కొన్ని మ్యాచ్ ల‌లో బౌలింగ్ కూడా చేశాడు. ఐపీఎల్ లో రాణించాడు, దీంతో అంతటా కీర్త‌న‌లే వినిపించాయి. అయితే హార్దిక్ కొన్నాళ్లుగా ఫెయిల్ అవుతున్నాడు. ఆస్ట్రేలియాలో, శ్రీలంక‌లో, ఐపీఎల్ లో కూడా రాణించ‌లేక‌పోయాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య‌న అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ మ‌ధ్య‌నే బీసీసీఐ కాంట్రాక్ట్ లో కూడా హార్ధిక్ గ్రేడ్ త‌గ్గింది. వ‌చ్చే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు హార్ధిక్ కు చోటు ద‌క్కుతుందా? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారిందిప్పుడు.

ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ వంతు. నాలుగు టెస్టులు ఆడిన శార్దూల్ ఖాతాలో మూడు హాఫ్ సెంచ‌రీలు, కొన్ని వికెట్లు ఉన్నాయి. ఓవ‌ల్ మ్యాచ్ లో కీల‌క‌మైన సంద‌ర్భాల్లో రాణించాడు కూడా. ఇంత‌లోనే శార్దూల్ ను నిఖార్సైన ఆల్ రౌండ‌ర్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఒక‌టీ రెండు మ్యాచ్ ల‌కు ఇలాంటి కీర్త‌న‌లు అవ‌స‌ర‌మా? అనేది ప్ర‌శ్న‌. గ‌తంలో ఇర్ఫాన్, హార్ధిక్ ఉదంతాల‌ను మ‌రిచిపోలేం.

ఇలాంటి నేప‌థ్యంలో.. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ గావ‌స్క‌ర్ స్పందించారు. క‌పిల్ లాంటి ఆల్ రౌండ‌ర్ ఇక‌పై రాడు, రాబోడు అంటూ తేల్చి చెప్పాడు. ఒక‌టీ రెండు మ్యాచ్ ల‌కే కుర్రాళ్ల‌ను క‌పిల్ తో పోల్చి.. వారి కెరీర్ ను పాడు చేయ‌వ‌ద్ద‌న్న‌ట్టుగా గావ‌స్క‌ర్ స్పందించిన‌ట్టుగా ఉన్నాడు. క‌పిల్ దేవ్ ఒక్క‌డే అని, మ‌రో క‌పిల్ సాధ్యం కాడ‌ని.. త‌న స‌హ‌చ‌రుడి నిజ‌మైన గొప్ప‌దనాన్ని ప్ర‌స్తావిస్తూ గావ‌స్క‌ర్ స్పందించారు. లేని పోని ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని అభిమానుల‌కు కూడా హిత‌బోధ చేశాడు ఈ మాజీ క్రికెట‌ర్.