Begin typing your search above and press return to search.

తన ఉద్యమం మారథాన్ అంట

By:  Tupaki Desk   |   31 Aug 2015 9:29 AM IST
తన ఉద్యమం మారథాన్ అంట
X
తన రాజకీయ ప్రత్యర్థులను బంతాట ఆడుకునే ప్రధాని మోడీకి కొత్త కష్టం వచ్చి పడింది. తనకు తిరుగులేదనుకునే తన ఇలాకా గుజరాత్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయనలో కలవరం మొదలైనట్లు చెప్పాలి. ఏ విషయానికి పెద్దగా స్పందించకుండా.. జరిగే ఆందోళనలన్నీ చాలా చిన్నవన్నట్లుగా.. తన స్థాయికి తగ్గ విషయాలు కాదన్నట్లు వ్యవహరించే మోడీ సైతం.. మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పించాడు హార్థిక్ పటేల్.

గుజరాత్ లోని పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని.. వారిని ఓబీసీలో చేర్చాలన్న నినాదంతో కేవలం నెలల వ్యవధిలే.. గుజరాత్ సర్కారుకు తన నోటి మాటతో సినిమా చూపించే స్థాయికి ఎదిగిన వైనం తెలిసిందే. వాగ్ధాటితో పాటు.. పటేళ్ల మనసుల్నితన మాటతో గెలుచుకున్న హార్థిక్ మాటకు ఇప్పుడు పటేళ్లు ఫిదా అయిపోతున్నారు.

ఆయన నోటి వెంట పిలుపు రావటమే ఆలస్యం కదం తొక్కుతున్నారు. ఈ మధ్యన ఆయనిచ్చిన ర్యాలీ పిలుపునకు ఆహ్మాదాబాద్ నగరం ఏ విధంగా జనసంద్రమైందో చూసిన వారికి నోట మాట రాని పరిస్థితి. నూనూగుమీసాల యువకుడు దెబ్బకు.. అంత పెద్ద మోడీ సైతం స్పందించి.. ఆవేశం మంచిది కాదని.. సంయమనం పాటించాలని పేర్కొనటం గమనార్హం.

అలాంటి హార్దిక్ పటేల్ నోటి నుంచి తాజాగా మరిన్ని బుల్లెట్ లాంటి మాటలు వచ్చాయి. తమ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి విస్తరిస్తామని.. 12 రాష్ట్రాల ప్రజలను కలుపుకొని రిజర్వేషన్ల కోసం పోరాడతామని స్పష్టం చేశారు.

తాము చేసే ఆందోలన వంద మీటర్ల రేసు కాదంటూ.. ఇప్పటికిప్పుడే ముగియదని స్పష్టం చేస్తూ.. ‘‘ఆదో మారథాన్ లాంటిది. ఒకట్రెండేళ్లు పట్టొచ్చు. పలు రాష్ట్రాల్లో మా వర్గీయుల్ని కూడగట్టుకొని పోరాడాలన్నదే మా అభిమతం. దేశ వ్యాప్తంగా ఎక్కడ పటేళ్ల వర్గం నన్ను కోరుకుంటుందో అక్కడికి నేను వెళతా. వారి తరఫున ఉద్యమిస్తా’’ అంటూ పెద్ద మాటలు చెబుతున్నాడు. మొదట గుజరాత్ లో బాగా పాగా వేసిన తర్వాత.. మిగిలిన రాష్ట్రాలపై దృష్టి పెడితే బాగుంటుందేమో.