Begin typing your search above and press return to search.

బీజేపీలోకి 'హార్దిక్..' తదుపరి సీఎం? పాండ్యా కాదు పటేల్..

By:  Tupaki Desk   |   31 May 2022 5:30 PM GMT
బీజేపీలోకి హార్దిక్.. తదుపరి సీఎం? పాండ్యా కాదు పటేల్..
X
గుజరాత్ బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు హార్దిక్ పటేల్ ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరడం ఖాయమైంది. యువ నాయకుడైన హార్దిక్ కు అక్కడి ప్రధాన సామాజిక వర్గం పటీదార్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతలా అంటే.. పటీదార్లకు రిజర్వేషన్ అంశంపై నాలుగైదేళ్ల కిందట హార్దిక్ పిలుపునకు లక్షల మంది పటీదార్లు తరలివచ్చారు. ఆ జన సమూహాన్ని చూసి బీజేపీ బెదిరిపోయింది. అందుకే అతడిని నియంత్రణలో తెచ్చకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ, హార్దిక్ అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరారు.

నాడు కాంగ్రెస్ కు బూస్ట్, నేడు బీజేపీకి హార్దిక్ హార్లిక్స్ హార్దిక్ పటేల్ తో పాటు దళిత మేధావి జిగ్నేశ్ మేవానీ అండతో 2017 ఎన్నికల్లో గుజరాత్ లో కాంగ్రెస్ పుంజుకొంది. బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. ఓ దశలో బీజేపీకి ఓటమి తప్పదని.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం ఆ పార్టీ చేజారుతుందని అంచనాలు వచ్చాయి. కానీ, బీజేపీ కొద్దిలో అధికారాన్ని నిలుపుకొంది. వాస్తవానికి 20 ఏళ్లు పైగా బీజేపీ గుజరాత్ ను ఏకధాటిగా ఏలుతోంది. 2002లో అల్లర్ల తర్వాత ఆ పార్టీ మూలాలు ఎన్నడూ లేనంత బలపడ్డాయి. వాటిని ఛేదించాలంటే సాధ్యమయ్యే పనికాదు. దీంతోనే బీజేపీ ఇంతకాలం నెట్టుకొచ్చింది. కానీ.. రాన్రాను కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

వ్యతిరేకతను తట్టుకోవాలంటే..20 ఏళ్లు అధికారంలో ఉన్నచోట పార్టీ, ప్రభుత్వంపై ఎంతలేదన్నా వ్యతిరేకత ఉంటుంది. దీనిని తట్టుకోవాలంటే చాలా బలమైన ప్రయత్నాలు అవసరం. కానీ, గుజరాత్ బీజేపీలో ఆ స్థాయి వ్యక్తులు కనిపించడం లేదు. మోదీ ప్రధానిగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆయన తర్వాతి స్థాయి నాయకుడైన అమిత్ షా కూడా కేంద్ర హోం మంత్రిగా తిరుగులేని స్థానంలో ఉన్నారు. వీరిద్దరినీ మించి ప్రజాదరణ, పార్టీని కనుసైగలతో నడిపించగల నాయకుడు గుజరాత్ లో బీజేపీకి అవసరం. అది పార్టీలో ఉన్నవారితో ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.

ముగ్గురు సీఎంల మార్పు మోదీ 2002 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా పనిచేయగా.. ఈ పదేళ్లలో ముగ్గురు సీఎంలు మారారు. ఆనందీ పటేల్, విజయ్ రూపానీ, భూపేంద్ర పటేల్ ఇలా మార్చుకుంటూ పోవాల్సి వచ్చింది. వీరిలో ఆనందీపై తీవ్ర వ్యతిరేకతతో రెండేళ్లకే తప్పించారు. రూపానీ ఐదేళ్లు కొనసాగినా అంతా అస్తవ్యస్తమే. ఇక ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ వయోధికుడు. ఆయన్ను ముందుపెట్టి వచ్చే ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి.

యువకుడిని తెచ్చి.. కీలక ఎన్నికల్లో తలపడాలని 28 ఏళ్ల హార్దిక్ పటేల్ కు పటీదార్ల వర్గంలో ఉన్న పాపులారీటి అంతాఇంతా కాదు. దానిని సొమ్ము చేసుకుంటూ.. బలమైన అతడి నాయకత్వాన్ని చూపుతూ ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ ప్రణాళికగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఈసారి ఎన్నికలు మరింత కీలకంగా నిలవనున్నాయి. బీజేపీ గనుక గుజరాత్ ఓడితే దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుంది. విపక్షాల విమర్శలకు అవకాశం దక్కుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎన్నికలను చేజారనీయకూడదు. అందుకే హార్దిక్ పటేల్ ను బీజేపీ బుట్టలో వేసుకుంది.

ఆ హార్దిక్ కప్ తెచ్చాడు.. మరి ఈ హార్దిక్ గెలిపిస్తాడా..?రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కప్ అందించాడు. మరి రాబోయే ఎన్నికల్లో హార్దిక్ పటేల్ బీజేపీని ఒడ్డున పడేస్తాడా? చూడాలి.. హార్దిక్ పేరు బలం ఏమేరకు బీజేపీకి ఉపయోగపడుతుందో..?