Begin typing your search above and press return to search.

పైల‌ట్‌ జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు..ఉద్యోగం ఊస్ట్‌

By:  Tupaki Desk   |   27 April 2017 3:26 AM GMT
పైల‌ట్‌ జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు..ఉద్యోగం ఊస్ట్‌
X
జాతి వివ‌క్ష వ్యాఖ్య‌ల్లో కొత్త కోణం ఇది. విమాన పైలెట్ ఒక‌రు భార‌తీయుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే జాతి వివ‌క్ష వ్యాఖ్యలు చేసినందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఒక పైలట్‌ను ఆ సంస్థ ఉద్యోగంనుంచి తొలగించింది. ఒక మహిళపై పైలట్‌ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడంటూ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆరోపించారు. ఆ సంఘటనపై జెట్‌ ఎయిర్‌వేస్‌ విచారం వ్యక్తం చేసింది. అనంతరం విచారణ జరిపి పైలట్‌ను ఉద్యోగంనుంచి తొలగించింది.

కాగా, జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌పై హ‌ర్భ‌జ‌న్ వ‌రుస ట్వీట్ల‌తో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దివ్యాంగుడితో పాటు మహిళను జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌ దూషించడమే కాకుండా దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని హర్భజన్‌ మండిపడ్డాడు. ఫారిన్‌ పైలట్‌ అనుచిత వ్యాఖ్యలపై (పైలట్‌... యూ బ్లడీ ఇండియన్‌ గెట్‌ అవుట్‌ మై ఫ్లయిట్‌) అతడు తన ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌ బెర్నాడ్‌ హోస్లిన్‌ దురహంకార ప్రవర్తనను భజ్జీ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పరిణామం జెట్‌ ఎయిర్‌వేస్‌కు అవమానకరమని పేర్కొంటూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పైలట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హర్భజన్‌ డిమాండ్‌ చేశారు.

హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఘాటు ట్వీట్ల నేప‌థ్యంలో జెట్ ఎయిర్ వేస్ స్పందించింది. సంఘటనపై చింతిస్తున్నామని, పైలెట్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆ సంస్థ వెల్లడించింది. అనంత‌రం స‌ద‌రు పైలెట్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించింది.