Begin typing your search above and press return to search.

ఫోన్లో అలా చేసినా నిర్భయ కేసే

By:  Tupaki Desk   |   3 April 2016 5:22 AM GMT
ఫోన్లో అలా చేసినా నిర్భయ కేసే
X
ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. తామేం చేసినా చట్టం ఏం చేస్తుందన్నట్లుగా వ్యవహరించే అతిగాళ్లకు చెక్ చెప్పేలా హైదరాబాద్ పోలీసులు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాలేజీ అమ్మాయిల్ని మొదలు గృహిణుల వరకూ ఎవరినీ వదలకుండా వేధించే ఆకతాయిలకు ముకుతాడు వేసేలా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకొని మంచి చేయాల్సింది పోయి.. పిచ్చి వేషాలు వేసే వారికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు నగర పోలీసులు రెఢీ అయిపోయారు.

అమ్మాయిల ఫోన్ నెంబర్లు తెలుసుకొని.. వారిని వేధించి.. వెంటబడే కుర్రాళ్లకు షాకిచ్చేలా.. ఆ తరహా తప్పులు చేసే వారిపై కఠినమైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లతో తరచూ ఆడాళ్లను వేధించే పోకిరీలకు చెక్ చెప్పేందుకు వీలుగా అలాంటి వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయనున్నారు.

ఫోన్ల ద్వారా ఈ మధ్య కాలంలో వేధింపులు పెరగటం.. దీనిపై మహిళలు తమ బాధల్ని చెప్పుకునేందుకు వెనకడుగు వేయటం.. సాక్ష్యంగా నిలుస్తాయా? అన్న సందేహంతో పాటు.. నీ నెంబరు వాడికి ఎలా తెలిసిందంటూ ఇంట్లో వాళ్లే వేసే ప్రశ్నల కారణంగా కామ్ గా ఉంటూ.. విపరీతమైన వేదనకు గురయ్యే మహిళలకు అండగా ఉండేందుకు వీలుగా.. ఫోన్లలో వేధించే మగాళ్లపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ తరహా వేధింపులకు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయొచ్చని న్యాయనిపుణులు సైతం ఓకే చెబుతున్న నేపథ్యంలో.. అల్లరిచిల్లరి అబ్బాయిలు ఫోన్ తో ఆకతాయి చేష్టలు చేస్తే అడ్డంగా బుక్ అయిపోవటమే కాదు.. జీవితం చంకనాకి పోవటం ఖాయం.