Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రి పాచిక పార‌లేదా..?

By:  Tupaki Desk   |   23 July 2021 4:30 PM GMT
ముఖ్య‌మంత్రి పాచిక పార‌లేదా..?
X
క‌ర్నాట‌క బీజేపీలో ఊహించిందే జ‌రిగింది. ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అధిష్టానం నిర్ణ‌యం తీసేసుకుంది. అంతేకాదు.. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న నోటితో చెప్పించ‌డమే అస‌లైన రాజ‌కీయం. క‌న్న‌డ విధాన స‌భ‌లో మాట్లాడిన య‌డ్యూర‌ప్ప‌.. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. దీనికి ఆయ‌న చెప్పిన కార‌ణం ఏమంటే.. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని ప‌ద‌వుల నుంచి త‌ప్పించే సంప్ర‌దాయం ఉంద‌ని, ఆ కార‌ణంగానే తాను కూడా ప‌క్క‌కు త‌ప్పుకుంటున్న‌ట్టు చెప్పుకొచ్చారు. దీంతో.. ఇందులో వాస్త‌వం ఎంత అనే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

నిజానికి ఇదే స‌రైన కార‌ణ‌మైతే.. య‌డ్యూర‌ప్ప ప్ర‌స్తుత వ‌య‌సు 78 సంవ‌త్స‌రాలు. ఆయ‌న సీఎంగా రెండేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసుకోబోతున్నారు. అంటే.. ఈ లెక్క‌న ఆయ‌న ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న‌ది 75 ఏళ్ల త‌ర్వాత‌నే. మ‌రి, బీజేపీ సంప్ర‌దాయం ప్ర‌కార‌మైతే.. ఇలా మ‌ధ్య‌లో తొల‌గించ‌డానికి బ‌దులు.. రెండేళ్ల కింద‌ట‌నే వేరే ముఖ్య‌మంత్రిని ఎంపిక చేసి ఉండాలి క‌దా? అనే చ‌ర్చ తెర‌పైకి వ‌స్తోంది. వివిధ కార‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ అధిష్టానం యెడ్డీని తొల‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నందున‌.. ఈ నిర్ణ‌యాన్ని ఆపేందుకు చివ‌రి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైనందున‌.. ఇక‌, గౌర‌వ‌ప్ర‌దంగా ప‌క్క‌కు తొల‌గ‌డ‌మే మేల‌ని భావించి, ఈ ప్ర‌క‌ట‌న చేశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే.. ముఖ్య‌మంత్రి పీఠాన్ని కాపాడుకోవ‌డానికి య‌డ్యూర‌ప్ప ఏమేం ప్ర‌య‌త్నాలు చేయ‌గ‌ల‌రో.. అన్నీ చేశార‌న్న‌ది ఆఫ్ ది రికార్డ్ సారాంశం. గ‌తంలో వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కు తోడు.. ఇత‌ర‌త్రా విమ‌ర్శ‌లు రావ‌డంతో.. సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి మొద‌లైంది. అది గ‌డిచిన ఏడాది కాలంలో తార‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. యెడ్డీని సీఎం సీటు నుంచి దింపేయాల‌ని చాలా కాలంగా పార్టీలోని ఓ వ‌ర్గం గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు ప‌లుమార్లు బీజేపీ అధిష్టాన్ని క‌లిసి వ‌స్తోంది. అయితే.. ఈ డిమాండ్ కు కాషాయ పెద్ద‌లు సానుకూలంగా ఉన్నార‌నే ప్ర‌చారం కొంత కాలంగా సాగుతోంది. ఎట్ట‌కేల‌కు ఆ ముహూర్తం ఇప్పుడు వ‌చ్చేసింది.

ఈ నెల 26వ తేదీతో క‌ర్నాట‌క‌లో బీజేపీ అధికారం చేప‌ట్టి రెండేళ్లు పూర్త‌వుతుంది. ఈ రోజునే కొత్త ముఖ్య‌మంత్రిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. నిజానికి త‌న సీఎం సీటును కాపాడుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించార‌ని టాక్‌. 26వ తేదీన జ‌ర‌గ‌బోయే రెండో వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు య‌డ్యూర‌ప్ప ప్లాన్ చేశార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. దానికి ఒక్క రోజు ముందు అంటే.. 25వ తేదీన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు విందు ఏర్పాటు చేశార‌నే ప్ర‌చారం బ‌హిరంగంగానే సాగింది. అయితే.. యెడ్డీని త‌ప్పించ‌డం ఖాయం కావ‌డంతో.. ఈ విందులు, వినోదాలు మొత్తం ర‌ద్దైపోయాయి. ఎలాంటి ఆడంబ‌రాలూ లేవంటూ ప్ర‌క‌ట‌న కూడా జారీ అయ్యింది.

క‌ర్నాట‌క‌లో బ‌ల‌మైన వ‌ర్గ‌మైన‌ లింగాయ‌త్ లు య‌డ్యూర‌ప్ప‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ర్యాలీలు కూడా తీశారు. యెడ్డీని తొల‌గిస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రిక‌లు జారీచేశారు. బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కూడా యెడ్డీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. అధిష్టానాన్ని కూడా త‌ప్పుబ‌ట్టారు. క‌ర్నాట‌క‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది య‌డ్యూర‌ప్ప‌నే అని అన్నారు. అయితే.. ఆయ‌న‌పై కొన్ని అభియోగాలు ఉన్న‌ప్ప‌టికీ.. యెడ్డీ ఎప్పుడూ ఎవ‌రికీ చంచాగిరీ చేయ‌లేద‌ని ఘాటుగా స్పందించారు. ఆయ‌న లేకుంటే.. క‌ర్నాట‌క‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేదే కాద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. క‌ర్నాట‌క‌లో బీజేపీ మ‌రోసారి అధికారం చేప‌ట్టాల‌న్నా.. య‌డ్యూర‌ప్ప‌నే ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. ఎప్పుడూ ఇలాంటి త‌ప్పిదాల‌నే ఎందుకు చేస్తారు అంటూ అధిష్టానంపై వ్యాఖ్య‌లు చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. యెడ్డీని తొల‌గించేందుకే పార్టీ పెద్ద‌లు మొగ్గు చూపారు. ఈయ‌న‌స్థానంలో సీఎం సీటు కోసం ప్ర‌హ్లాద్ జోషి, సీటీ ర‌వి, మంత్రి మురుగేష్ నిర్వాణీ, అశ్వ‌థ్త నారాయ‌ణ పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఆరెస్సెస్ మ‌ద్ద‌తు మాత్రం జోషికి, సీటీ ర‌వికి ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి, యెడ్డీ స్థానంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చుంటార‌నేది చూడాలి.