Begin typing your search above and press return to search.

మూడు రోజులు ఆలోచించి సల్మాన్ చెప్పిన మాట

By:  Tupaki Desk   |   26 July 2015 6:02 AM GMT
మూడు రోజులు ఆలోచించి సల్మాన్ చెప్పిన మాట
X
మరో సంచలన వ్యాఖ్యను ట్విట్టర్ ద్వారా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ముంబయి పేలుళ్లలో 250 మంది అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమైన యాకూబ్ మెమన్ ను ఈ నెల 30న ఉరి తీయాలంటూ కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

దీనిపై తాజాగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా.. సంచలనాత్మకంగా మారాయి. పేలుళ్ల వ్యవహారంలో యాకూబ్ అమాయకుడని.. ఆయనను ఉరి తీయటం సరికాదంటూ ట్వీట్ చేశారు.

ఈ కేసులో అసలు నిందితుడు యాకూబ్ సోదరుడని.. అతన్ని పట్టుకొచ్చి బహిరంగంగా ఉరి తీయాలని ట్వీట్ చేశాడు. తమ్ముడు ఉరికంబం ఎక్కుతుంటే.. తన ప్రాణాలు కాపాడుకునేందుకు తప్పించుకు తిరుగుతున్న టైగర్.. టైగరే కాదని.. పిల్లి అని వ్యాఖ్యానించారు. సల్మాన్ ట్వీట్స్ లో భావోద్వేగం స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో టైగర్ల కొరత ఉందని.. దాన్ని పట్టుకు రావాలని.. టైగర్ అని పిలిపించుకునే అర్హత లేదన్నారు. తానీ అభిప్రాయం ట్వీట్ రూపంలో బయటపెట్టేందుకు మూడు రోజులు ఆలోచించినట్లుగా వ్యాఖ్యానించారు.

సల్మాన్ వాదనలో నిజానిజాల్ని పక్కన పెడితే.. ఉరి తీయటానికి నాలుగు రోజులు ముందు ట్వీట్ చేసి కలకలం సృష్టించటంలో అర్థం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ.. యాకూబ్ మెమన్ కానీ తప్పు చేయలేదని సల్మాన్ నిజంగా నమ్మితే.. ఈ కేసు మొదటి నుంచే అతని తరఫున ఇదే తీరులో మాట్లాడి.. న్యాయ సాయం అందిస్తే బాగుండేదేమో. అదేమీ లేకుండా సాక్ష్యాలతో అతని పాత్ర నిరూపితం అయ్యాక.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాధ్యతతో కూడుకున్నదేనా?