Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు సగం గెలుపు

By:  Tupaki Desk   |   18 Nov 2020 2:40 PM IST
గ్రేటర్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు సగం గెలుపు
X
అందరు అనుకుంటున్నట్లు గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి ఉత్కంటత లేదు. ఈ మాట చెబితే నమ్మరు. కానీ.. ఇది నిజం. మీడియాలో హైప్ చేసినంత సీన్ లేదు. కాకుంటే..గతంలో టీఆర్ఎస్ కు వచ్చిన 99 సీట్లకు ఎన్ని తగ్గుతాయన్న ఆసక్తి మాత్రమే ఉంది. అదే సమయంలో దుబ్బాకలో సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ.. గ్రేటర్ లో ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందన్నది మరో ప్రశ్న. ఈ రెండింటి మినహా గ్రేటర్లో ఆసక్తికరమైన అంశాలు లేవనే చెప్పారు.

ఎవరెన్ని విశ్లేషణలు చేసినా.. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే. ఆ మాటకు వస్తే ఎన్నికల ప్రక్రియ షురూ కాక ముందే.. ఆ పార్టీ గెలుపు సగానికి పైనే దూరం వచ్చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాక ముందే గెలవటమా? అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత..కార్పొరేటర్లు ఎన్నుకునే వ్యక్తి మేయర్ గా ఎన్నిక అవుతారు. అయితే.. ఈ మేయర్ పదవి ఎవరికి సొంతం కావాలన్న అంశాన్ని కార్పొరేటర్లతో పాటు.. ఎక్స్ అఫీషియో సభ్యులు తేల్చనున్నారు.

గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ లెక్కన చూస్తే.. ఇప్పటికే టీఆర్ఎస్ కు 35 ఓట్లు ఉన్నాయి. మిత్రుడు మజ్లిస్ తో కలిపితే మర పది ఓట్లు ఉంటాయి. సొంతంగా టీఆర్ఎస్ కు చెందిన నేతే మేయర్ కావాలంటే.. కేవలం 41 ఓట్లు ఉంటే సరిపోతుంది.

అదెలానంటే.. గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. మెజార్టీకి కావాల్సింది 76 ఓట్లు. ఈ లెక్కన టీఆర్ఎస్ కు ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యులు 35ను తీసేస్తే.. కావాల్సింది 41 ఓట్లు మాత్రమే. అంటే.. మొత్తం 150 డివిజన్లలో 41 సీట్లు గెలవలేని దీనమైన స్థితిలో టీఆర్ఎస్ లేదు. దీంతో.. టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకనే.

ఒకవేళ.. అనూహ్యంగా (ఇది ఏ మాత్రం వాస్తవం కాదు. ఊహాజనితంగా ఆలోచిస్తే) బీజేపీ భారీ ఎత్తున డివిజన్లను అంటే.. 75కు పైనే స్థానాల్లో గెలిచిందని అనుకుందాం. అలాంటి వేళలోనూ టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కనుంది ఎందుకంటే.. మిత్రుడు మజ్లిస్ పుణ్యమా అని.. వారు గెలిచే స్థానాలు 40కు పైనే.. గత ఎన్నికల్లో వారు 44 స్థానాల్లో గెలిచారు. నాలుగు తగ్గించినా.. 40.. వారికున్న ఎక్స్ అఫీషియో సభ్యులు పది మంది.. టీఆర్ఎస్ కు ఉన్న 35 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు.. బీజేపీ.. మజ్లిస్ గెలవగా మిగిలినవి (75 + 40= 115) 35 స్థానాలు ఉంటాయి. వాటిల్లో టీఆర్ఎస్ గెలిచినా.. మొత్తం ఓట్లు టీఆర్ఎస్ కు (35+35+10+40= 120).. మిత్రుడు మజ్లిస్ తో కలిపి 120 స్థానాలు ఉంటాయి. అలా చూసినా.. గ్రేటర్ పీఠం గులాబీదే. కాకుంటే.. మేయర్ పీఠాన్ని మజ్లిస్ తో పంచుకోవాల్సిందే. బీజేపీకి ఇచ్చే బదులు మిత్రుడితో పంచుకోవటానికే గులాబీ బాస్ ఇష్టపడతారు కదా. ఇదంతా చూసినప్పుడు గ్రేటర్ ఎన్నికల తుది ఫలితం ఏమిటన్నది ఇప్పుడే స్పష్టమైందని చెప్పక తప్పదు.