Begin typing your search above and press return to search.

కర్ణాటకలో 'హలాల్' వివాదం..: ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   3 April 2022 10:23 AM IST
కర్ణాటకలో హలాల్ వివాదం..: ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X
కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం తలెత్తింది. మొన్నటి వరకు హిజాబ్ రచ్చతో రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన రేపిన నేపథ్యంలో తాజాగా మరో మత వివాదాన్ని సృష్టించారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి ఆజ్యం పోశాయని అంటున్నారు.

దీంతో మరోసారి దేశంలో మత రాజకీయం మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే హలాల్ హాంసారాహాన్ని తినొద్దని సంచలన ప్రకటన చేశారు. హిందువులు అమ్మే దుకాణాల్లోనే మాంసాహారం కొనుక్కోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారి తీస్తున్నాయి.

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో యడ్యూరప్ప సీఎం మార్పు నుంచి అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన తరువాత బస్వరాజు బొమ్మైపీటమెక్కిన తరువాత బీజేపీకి మరింత తలనొప్పిగా మరినట్లు తెలుస్తోంది. వివాదాలకు కేంద్రంగా కర్ణాటక మారుతుండడం బీజేపీ అధిష్టానానికి తలవంపులు తెస్తోంది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులే ఈ వివాదాలను సృష్టించడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని అంటున్నారు. మొన్నటి వరకు హిజాబ్ వివాదంతో దేశ వ్యాప్తంగా ఆందోళన రేకేత్తిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి హిజాబ్ ధరించి ముస్లిం విద్యార్థులు స్కూల్ కు వెళ్లొద్దని తీర్పునివ్వడంతో ఆ వివాదం సద్దు మణిగింది.

అయితే తాజాగా బీజేపీ నేతలు మరో వివాదాన్ని సృష్టించారు. హలాల్ చేసిన మాంసాహారాన్ని కొనుగోలు చేయొద్దని, అది ఆరోగ్యానికి హానికరమని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఈయన చేసిన వ్యాఖలు దుమారం లేవడంతో మరోసారి మత కల్లోలాలకు ఆజ్యం పోశాయా..? అని చర్చించుకుంటున్నారు. ఇక కొందరు ఇది ఆర్థిక జిహాద్ అని అంటున్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నేతలు సపోర్డు చేయడం మరింత వివాదాన్నిసృష్టించినట్లయింది.

ఇదిలా ఉండగా హిమాలయ సంస్థ హలాల్ పాలసీని ప్రకటించింది. ఆ పాలసీని చూపిస్తూ హిమాలయ ఉత్పత్తులు ఎవరూ కొనవద్దని పిలుపునిస్తున్నారు. బాయ్ కాట్ హిమాలయ అంటూ సోషల్ మీడియా వేదికగా పరేశ్ రావల్ వంటి వారు కూడా నినదించడంతో ఈ వివాదం మరింతగా ముదురుతోంది. అయితే మొత్తంగా కర్ణాటక రాష్ట్రంలో మత రాజకీయాలు మొదలై దేశ వ్యాప్తంగా ఇవి అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.