Begin typing your search above and press return to search.

అందం కోసం యువతి ఆరాటం.. చివరకు..

By:  Tupaki Desk   |   3 Sept 2018 5:49 PM IST
అందం కోసం యువతి ఆరాటం.. చివరకు..
X
నలుగురిలో అందంగా కనపడాలని ఓ యువతి తీసుకున్న నిర్ణయం చివరకు ఆమె ప్రాణాలనే బలిగొనేలా చేసింది.. తల వెంట్రుకలు రింగు రింగులుగా ఉండడానికి చేయించుకున్న చికిత్స వికటించింది. వెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి. దీన్ని అవమానంగా భావించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది..

కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేట తాలూకా కొట్టిగేరి గ్రామానికి చెందిన నేహా గంగమ్మ (18) బీబీఏ చదువుతోంది. తల వెంట్రుకలు రింగురింగులుగా ఉండడానికి మైసూరులోని ఓ బ్యూటీ పార్లర్ కు వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంది.

అయితే ఆ తర్వాత కొద్దిరోజులుగా ఆమె జుట్టు ఊడిపోతూనే ఉంది. ఆరు నెలలలోపే తల మీద ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి బోడిగుండుగా మారింది. దీంతో సహచర విద్యార్థులకు సమాధానం చెప్పలేక కళాశాలకు మానేసింది. వారం రోజుల క్రితం ఇంటి నుంచి కూడా వెళ్లిపోయింది. స్థానిక లక్ష్మణ తీర్థ నదిలో సోమవారం ఆమె మృతదేహం లభించింది. తల వెంట్రుకలు మొత్తం ఊడిపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.