Begin typing your search above and press return to search.

హ్యాక‌ర్ల దెబ్బ‌కు వ‌ణికిన తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ‌రంగ సైట్లు!

By:  Tupaki Desk   |   2 May 2019 5:21 AM GMT
హ్యాక‌ర్ల దెబ్బ‌కు వ‌ణికిన తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ‌రంగ సైట్లు!
X
ప్ర‌ధాన మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాని అంశమిది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వ రంగ విద్యుత్ సంస్థ‌ల‌పై అంత‌ర్జాతీయ హ్యాక‌ర్లు పంజా విసిరారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ‌ల వెబ్ సైట్ల‌ను హ్యాక్ చేసిన వైనం ఇప్పుడు అధికార వ‌ర్గాలకు కొత్త త‌ల‌నొప్పిగా మారింది.

డిస్కం సైట్ల‌లో ఉన్న డేటా మొత్తం మాయ‌మైనా.. వారు పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌టం లేదు. దీనికి కార‌ణం.. డేటాను వేరేగా బ్యాక‌ప్ చేసి ఉండ‌ట‌మే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. తాము సైట్ల నుంచి కొల్ల‌గొట్టిన డేటాను తిరిగి ఇవ్వాలంటే రూ.35 కోట్ల మొత్తాన్ని ఇవ్వాల‌ని హ్యాక‌ర్లు మొయిల్ ద్వారా పంపిన‌ట్లు తెలుస్తోంది.

అంత‌ర్జాతీయ హ్యాక‌ర్ల బారిన ప‌డిన డిస్కంల జాబితాలో ద‌క్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ‌.. హ‌న్మ‌కొండ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఉత్త‌ర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ‌.. తిరుప‌తి కేంద్రంగా ప‌ని చేస్తున్న ద‌క్షిణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ‌.. విశాఖ కేంద్రంగా ప‌ని చేస్తున్న తూర్పు ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ‌ల‌కు చెందిన అధికారిక వెబ్ సైట్ల‌ను హ్యాక‌ర్లు హ్యాక్ చేశారు.

ఈ సైట్ల‌లోని స‌మాచారం మొత్తాన్ని కొల్ల‌గొట్టేసిన వారు.. అనంత‌రం సైట్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేశారు. తాము కొల్ల‌గొట్టిన డేటాను తిరిగి ఇవ్వాలంటే కోట్లాది రూపాయిలు ఇవ్వాలంటూ బేరం పెడుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. హ్యాక్ అయిన వెబ్ సైట్లు మొత్తం.. ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ టసీఎస్ నిర్వహ‌ణ చేసేవే. తెలుగు రాష్ట్రాల్లోని డిస్కంల‌తో పాటు.. ఇండియ‌న్ ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సైతం టార్గెట్ చేయ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్రా బ్యాంక్ సైట్ ను టార్గెట్ చేస్తున్న‌ట్లు చెప్పినా.. ఈ సంస్థ‌ల నుంచి అధికారిక స‌మాచారం ఏదీ వెలువ‌డ‌లేదు.

డిస్కంల‌పై అంత‌ర్జాతీయ హ్యాక‌ర్ల పంజా దెబ్బ‌కు గ‌డిచిన రెండు రోజులుగా ఆన్ లైన్.. పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో.. వినియోగ‌దారులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. కీల‌క‌మైన శాఖ‌ల‌కు సంబంధించిన సైట్ల నిర్వ‌హ‌ణ హ్యాక‌ర్ల‌కు దొరికిపోయేలా ఉండ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.