Begin typing your search above and press return to search.

దాంతో.. 3.7 కోట్ల మంది బతుకు బస్టాం​డే​

By:  Tupaki Desk   |   21 Aug 2015 7:10 AM GMT
దాంతో.. 3.7 కోట్ల మంది బతుకు బస్టాం​డే​
X
గుట్టుగా ఏదో అక్రమ సంబంధాల్ని ఆన్ లైన్ లో వెతుక్కొని జీవితాల్ని లాగించేస్తున్న కోట్లాది మంది బతుకులు బస్ స్టాండ్ అయిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోయి.. ఊహించని సుఖాలే కాదు.. షాకులు కూడా తప్పవన్న నిజం తాజాగా మరోసారి నిరూపితమైంది. అక్కరకు వచ్చిన సాంకేతికత పుణ్యమా అని ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లలో మనసుకు నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తున్న వారి బతుకులు రోడ్డున పడిపోయాయి.

బ్రిటన్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఉదంతం.. ఆ దేశంలో భారీ సామాజిక సంక్షోభానికి దారి తీస్తుందని భయపడుతున్నారు. అష్లీమాడిసన్ అనే డేటింగ్ వెబ్ సైట్ లో కోట్లాదిమంది సభ్యులున్నారు. ఆన్ లైన్ లో డేటింగ్ కుదిర్చి పెట్టే ఈ వెబ్ సైట్ పుణ్యమా అని అక్రమ సంబంధాలు మూడు ముద్దులు.. ఆరు అనుభూతులుగా మారిపోయిన పరిస్థితి.

అయితే.. ఈ వెబ్ సైట్ కి సంబంధించి దాదాపు 3.7 కోట్ల మంది వరకూ సభ్యుల అసలు సమాచారాన్ని హ్యాకర్లు హ్యాక్ చేశారు. వెబ్ సైట్ సర్వర్లలోకి దూరిపోయి మరీ.. బయటకు తీసిన సమాచారంతో ఇందులోని సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారం బజార్ లోకి వచ్చేసింది. వారి పేర్లు.. వివరాలు.. టెలిఫోన్ నెంబర్లు.. క్రెడిట్ కార్డు నెంబర్లతో సహా అన్నీ బయటకు వచ్చేసిన దుస్థితి.

ఇలా ఈ డేటింగ్ వెబ్ సైట్ లో సభ్యులుగా సామాన్యులే కాదు.. బ్రిటన్ కు చెందిన ఒక మహిళా ఎంపీ.. అత్యంత రహస్యంగా ప్రయోగాలు చేసే రక్షణ శాఖకు చెందిన శాస్త్రవేత్తలతో పాటు.. 124 మంది ప్రభుత్వ అధికారులు.. 92 మంది రక్షణ శాఖ... 50 మంది పోలీసు అధికారులు.. వివిధ యూనివర్సిటీల్లో పని చేసే సిబ్బంది 1716 మందితో సహా చాలామందే ఉన్నారు.

నిన్నటివరకూ గుట్టుగా సాగిపోయిన ఈ యవ్వారం ఇప్పుడు బయటకు పొక్కటంతో.. చాలామంది ఇదంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నారని..తమకు అలాంటి బూతుసైట్ల గురించి అస్సలు చూడలేదని.. వినింది కూడా లేదని చెప్పుకొస్తున్నారు. నకిలీ పేర్లతో ఖాతాలు తెరిచే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. మరి.. పేర్లు బయటకు వచ్చిన వారిలో మాయకులు ఎందరో.. అమాయకులు ఎందరో తెలీని పరిస్థితి. హ్యాకర్లకు ఏం మిగిలిందో కానీ.. కోట్లాదిమందికి మాత్రం కంటి నిండా కునుకు కరువైన దుస్థితి.