Begin typing your search above and press return to search.

యూఎస్-ఇండియా మ‌ధ్య హెచ్‌1బీ చిచ్చు

By:  Tupaki Desk   |   13 March 2017 4:24 AM GMT
యూఎస్-ఇండియా మ‌ధ్య హెచ్‌1బీ చిచ్చు
X
అగ్ర‌రాజ్యం అమెరికా- నిపుణుల దేశం భారత్ మధ్య హెచ్1బీ అంశం వివాదం రాజేయనుందా? మిత్రదేశాలుగా ఉన్న రెండు దేశాల మధ్య ఆందోళనలకు కారణం కానుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖలో దక్షిణ - మధ్య ఆసియా వ్యవహారాల విభాగం మాజీ సహాయ కార్యదర్శిగా పనిచేసిన భారతీయ అమెరికన్ నిషా దేశాయ్ బిస్వాల్. లక్షలమంది భారతీయుల ఉపాధికి సంబంధించినది కావడంతో ఈ అంశంపై విస్తృతమైన చర్చ జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. హెచ్1బీ వీసాలను మరింత కఠినతరం చేస్తూ అర డజనుకుపైగా బిల్లులను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పాత హెచ్1బీ వీసా విధానం అమెరికా, భారత్‌కు ఎంతో కీలకమైనదని.. ఇరుపక్షాలకు ఉపయోగకరమని భారతీయ అమెరికన్ నిషా దేశాయ్ బిస్వాల్ విశ్లేషించారు. ఈ విధానం అమలులో కొన్ని తప్పులు జరుగుతున్నా.. అమెరికా ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడిన విషయాన్ని మరువకూడదని ట్రంప్ ప్రభుత్వానికి ఆమె సూచనలు చేశారు. ముందుగా అవసరాలకు తగినట్టుగా అమెరికన్లను సిద్ధం చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, పనితీరులో మార్పులు ఇతర అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కొత్త నిబంధ‌న‌ల‌తో త‌మ దేశానికి జ‌రిగే భారీ న‌ష్టాన్ని పూడ్చుకునే స‌మ‌యంలో భార‌త్ వ్య‌వ‌హార‌శైలి అమెరికాకు న‌చ్చ‌క‌పోవ‌చ్చున‌ని అమె పేర్కొన్నారు. అందుకే ఈ రెండు దేశాల స‌ఖ్య‌త‌ను హెచ్‌1బీ దెబ్బ‌తీయ‌వ‌చ్చున‌ని చెప్పారు.

ఇదిలాఉండ‌గా... హెచ్1బీ వీసా జారీలో ట్రంప్ చేయనున్న మార్పులు చేసేందుకు ట్రంప్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఉద్యోగుల కనీస వేతనాలను రెట్టింపు కంటే అధికం చేయాలని డిసైడ‌యింది. ఓ సంస్థ విదేశాల్లో పనిచేస్తున్న తన ఉద్యోగిని అమెరికాకు బదిలీ చేయాలంటే అతడి కనీసం వేతనం ఏడాదికి 60వేల డాలర్లు ఉంటే సరిపోయేది. ట్రంప్ సర్కారు ఆ వేతనం పరిమితిని 1.3లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం సంస్థలపై తీవ్ర ఆర్థికభారంగా మారనుంది. ఉన్నతస్థాయి వ్యక్తులకు ఆ స్థాయిలో వేతనాలు అందుతున్నా.. కీలకమైన ద్వితీయశ్రేణి నిపుణులకు ఆ స్థాయిలో వేతనాలను ఇచ్చే స్థితిలో సంస్థలు లేవు. అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులను ఇప్పటివరకు కంప్యూటర్ ఆధారిత లాటరీలో ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేయనున్నారు. 50మందికంటే తక్కువమంది ఉద్యోగులు ఉన్న స్టార్టప్ కంపెనీలు, చిన్న సంస్థలకు హెచ్1బీవీసా జారీలో 20శాతం కోటా ఇవ్వనున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి మరింత కఠినమైన నిబంధనలు అమలుచేయాలని ట్రంప్ సర్కారు భావిస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/