Begin typing your search above and press return to search.

హెచ్-1బీ ఆంక్షలతో అమెరికాకే నష్టం!

By:  Tupaki Desk   |   9 Aug 2017 5:41 AM GMT
హెచ్-1బీ ఆంక్షలతో అమెరికాకే నష్టం!
X
హెచ్-1బీ వీసాపై ఆంక్షలు విధించడం వల్ల అమెరికాకే నష్టం జరుగుతుందా? అమెరికా ఆదాయంపై దీని ప్రభావం పడనుందా?.. అవునని అంటున్నది ఓ నివేదిక. ఈ వీసాపై ఆంక్షలు విధించడం వల్ల భారత్ తదితర దేశాల నుంచి వచ్చే మేధావుల సంఖ్య తగ్గిపోతుందని, తద్వారా వారి సేవలను అమెరికా కోల్పోవాల్సి వస్తుందని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌ మెంట్(జీసీడీ) తన నివేదికలో పేర్కొంది. ఫలితంగా ఐటీ ఉత్పత్తుల్లో పేరొందిన అమెరికా క్రమంగా తన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

అమెరికాలోని ఐటీ రంగంపై రూపొందించిన ఈ నివేదికలో 2000 నుంచి అమెరికాలో వలసలు - ఐటీ ఉత్పత్తుల మధ్య సంబంధాన్ని జీసీడీ పరిశీలించింది. 2010లో అమెరికా ఉద్యోగుల్లో ఒక్కొక్కరు 431 డాలర్ల విలువైన సేవలను ఉత్పత్తి చేయగా.. ఇతర దేశాలకు చెందిన వాళ్లు సగటున 1,345 డాలర్ల సేవలను ఉత్పత్తి చేశారు. ఇదంతా హెచ్-1బీ వీసాల వల్లనే సాధ్యమైందని నివేదిక తెలిపింది. ఈ వీసా విధానం వల్ల అమెరికా ఐటీ ఉద్యోగులు కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికా, భారత్ కలిసి సుమారు 17.3 బిలియన్ డాలర్ల మిగులు ఆదాయాన్ని సాధించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో ఇరుదేశాలు సహకరించుకోవడం మంచిదని, భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నివేదిక సూచించింది.

‘హెచ్1బి వీసా కార్యక్రమం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు లబ్ధి పొందిన మాట వాస్తవం. ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటంవల్ల భారత్‌నుంచి వచ్చే నైపుణ్యం రాకుండా పోతుంది. ఐటీ ఉత్పత్తి రంగంలో అమెరికా వెనుకబడుతుంది’ అని సీజీడీ ఫెలో అయిన గౌరవ్ ఖన్నా అన్నారు. భారత్‌నుంచి మేథోవలసలు తగ్గటంవల్ల ఆ దేశం లాభపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయన్నారు. ‘అమెరికాకు రావటం అన్న ఆకాంక్ష పలువురు విద్యార్థులను అమెరికాలో తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు హెచ్1బి వీసా దోహదపడుతుంది’ అని ఖన్నా వ్యాఖ్యానించారు. 2000నుంచి వలసలు, అవుట్‌సోర్సింగ్ వల్ల ఐటి ఉత్పత్తిలో అమెరికా కార్మికుల సంఖ్య యావరేజ్‌ ని మించలేదని ఖన్నా వెల్లడించారు.