Begin typing your search above and press return to search.

హెచ్1బీ కొత్త నిర్ణ‌యం ఇండియ‌న్ల‌కు షాకేనా?

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:31 AM GMT
హెచ్1బీ కొత్త నిర్ణ‌యం ఇండియ‌న్ల‌కు షాకేనా?
X
అవ‌కాశాల స్వ‌ర్గ‌దామంగా పేరొందిన అమెరికా నుంచి మ‌రో చేదు నిర్ణ‌యం వెలువ‌డింది. ప్ర‌ధానంగా మ‌న దేశానికి చెందిన టెకీలకు షాకిచ్చేలా ప‌రిణామాలు మారుతున్నాయి. హెచ్‌1బీ వీసా ప్రక్రియను అమెరికా మరింత కఠినతరం చేసేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. విదేశాల నుంచి ఉద్యోగులను హెచ్‌1బీ వీసాపై అమెరికాకు రప్పించుకునే కంపెనీలు వార్షిక హెచ్‌1బీ లాటరీ కోసం ముందుగానే ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అమెరికా పౌరసత్వ- వలసదారుల సేవల సంస్థ స్పష్టం చేసింది. ముందు రిజిస్టర్‌ చేసుకున్న తర్వాతే వీసాల విజేతల కోసం పూర్తిస్థాయి దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు పూర్తి అప్లికేషన్‌ ను నింపి అందుకు అవసరమైన పత్రాలను జత చేస్తే లాటరీ పద్ధతికి దరఖాస్తు చేసుకున్నట్లే. వీసా దరఖాస్తులను కూలంకుషంగా పరిశీలించిన తర్వాత అధికారులు ఆయా కంపెనీల ఉద్యోగులకు ప్రాధాన్యతా క్రమంలో వీసాలను లాటరీ పద్ధతిలో మంజూరు చేస్తారు.

సాధారణంగా అమెరికాలోని ఐటీ సర్వీసు కంపెనీలు తమకు కావాల్సిన విదేశీ ఉద్యోగులకు హెచ్‌ 1బీ వీసాలను ప్రాసెస్‌ చేస్తాయి. తాజాగా మారుస్తున్న నిబంధనలతో ఆయా కంపెనీలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.విదేశీ ఉద్యోగులను ఎంపిక చేసుకునే కంపెనీలు.. తమ ఉద్యోగులకు వీసా వచ్చేది..రానిది పక్కాగా చెప్పలేని పరిస్థితి ఏర్పడనుంది. నూతన విధానాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు కార్యనిర్వాహక ఆఫీసుకు చెందిన మేనేజ్‌ మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ యూనిట్‌ ఆమోదించింది. అమెరికా పౌరసత్వ దారుల సంఖ్యను తగ్గించడం - వలసదారుల సేవలను కుదించడం వంటి అంశాలు తాజా నిబంధనలతో ముడిపడి ఉన్నాయి. వలసదారులతో చేయించే పనులను స్థానికులకే కట్టబెట్టేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏడాదికి 65వేల హెచ్‌ 1బీ వీసాలను జనరల్‌ కోటా కింద మంజూరు చేస్తారు.మరో 20 వేల వీసాలను అమెరికాలోని యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ చేసిన వారికి కేటాయిస్తారు. తాజా నిబంధనలతో ఈ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నూతన నిబంధనల ప్రకారం కంపెనీలు నియమించుకునే ఉద్యోగుల దరఖాస్తులను వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్దతిలో వీసాలు మంజూరు చేస్తారు.2018-19 సీజన్‌ కు గానూ అమెరికా ఏజెన్సీకి 1.9 లక్షల వీసా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో భారతీయులే 60 శాతానికి పైగా ఉండటం గమనార్హం. కాగ్నిజెంట్‌ - టీసీఎస్‌ - ఇన్ఫోసిస్‌ - విప్రో లాంటి ఐటీ కంపెనీలు ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులకు హెచ్‌ 1బీ వీసా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నూతన విధానం వల్ల ఆయా కంపెనీలకు కార్యనిర్వాహక ఖర్చు తగ్గుతున్నప్పటికీ.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కష్టాలు తెచ్చిపెడుతోంది. నూతన విధానంలో దరఖాస్తుదారుల అభిప్రాయాలు తెలుసుకుని .. విశ్లేషించి వీసా మంజూరు చేస్తారు. అయితే కొత్త నిబంధనల వల్ల ఉద్యోగులను థర్డ్‌ క్లైంట్‌ కింద భావించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునేందుకు అమెరికా వ్యూహాలు అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.