Begin typing your search above and press return to search.

గుడ్‌ న్యూస్..గ్రీన్‌ కార్డులు పెరుగుతున్నాయ్!

By:  Tupaki Desk   |   11 Jan 2018 12:57 PM GMT
గుడ్‌ న్యూస్..గ్రీన్‌ కార్డులు పెరుగుతున్నాయ్!
X
కొంత కాలం కింద‌టి వ‌ర‌కు చేదు వార్త‌ల‌కు కేంద్రంగా ఉన్న అగ్ర‌రాజ్యం అమెరికా...ఇటీవ‌ల వ‌రుస‌గా తీపి క‌బుర్ల‌ను వినిపిస్తోంది. హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పులేదని రెండ్రోజుల క్రితం ప్ర‌క‌టించిన అమెరికా...ఆ దేశంలో ఉన్న ఇండియన్ టెకీలకు మ‌రో గుడ్‌ న్యూస్ న్యూస్ వినిపించేందుకు సిద్ధ‌మైంది. గ్రీన్‌ కార్డుల సంఖ్యను ఏడాదికి 45 శాతం మేర పెంచే బిల్లును యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ లో ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే ఇండియన్ టెకీలకు పండుగే.

నైపుణ్య ఆధారిత వలస విధానం - గ్రీన్‌ కార్డుల పెంపునకు సంబంధించి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సెక్యూరింగ్ అమెరికాస్ ఫ్యూచర్ యాక్ట్ పేరుతో ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇది చట్టమైతే గనక.. ప్రస్తుతం ఏడాదికి లక్షా 20 వేలుగా ఉన్న గ్రీన్‌ కార్డుల సంఖ్య లక్షా 75 వేలకు చేరనుంది. ఇది హెచ్-1బీ వీసాలపై వెళ్లే ఇండియన్ టెకీలకు శుభవార్తే. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునే అవకాశం ఈ గ్రీన్‌ కార్డుల ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌ కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య 5 లక్షల వరకు ఉంది. వీళ్లంతా ఏడాది చొప్పున హెచ్-1బీ వీసాల గడువును పొడిగించుకుంటూ వెళ్తున్నారు. కొందరైతే దశాబ్దాలుగా గ్రీన్‌ కార్డుల కోసం చూస్తేనే ఉన్నారు.

హెచ్-1బీ వీసాల ద్వారా తాత్కాలికంగా విదేశీ నిపుణులను తీసుకునే అవకాశం అమెరికా కంపెనీలకు ఉంటుంది. ఇప్పుడు గ్రీన్‌ కార్డుల సంఖ్య పెరిగితే.. ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అయితే ఇదే చట్టంలో చెయిన్ మైగ్రేషన్‌ ను రద్దు చేసే క్లాజ్ కూడా ఉంది. అంటే కేవలం జీవిత భాగస్వాములు - మైనర్ పిల్లలకు తప్ప మిగతా బంధువులు ఎవరికీ గ్రీన్‌ కార్డులు ఇచ్చే అవకాశం ఉండకపోవడం ఇండియన్ అమెరికన్లకు కాస్త ఆందోళన కలిగించే విషయం.

ఇదిలాఉండ‌గా...వేలాదిమంది హెచ్1బీ వీసాదారుల్ని అమెరికా నుంచి వెనుకకు పంపే ఎలాంటి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోబోమని యూఎస్ ప్రభుత్వ యంత్రాంగం సోమవారం వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రకటనతో గ్రీన్‌ కార్డు కోసం వేచిచూస్తున్న అక్కడి భారతీయ హెచ్1బీ వీసాదారులకు ఊరట లభించింది. వీసా పొడిగింపును నిరాకరించి వేలాదిమంది వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనుకకు పంపించాలనే నిబంధనలను (యూఎస్‌ సీఐఎస్) పరిగణనలోకి తీసుకోదని ఆ విభాగం ప్రజాసంబంధాల అధికారి జొనాథన్ వితింగ్టన్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నిబంధనల మేరకు ఏసీ-21లోని సెక్షన్ 104(సీ) ప్రకారం హెచ్1బీ వీసాదారులకు ఆరేళ్ల‌కు పైగా పొడిగింపు లభిస్తున్నది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోబోమని యూఎస్‌ సీఐఎస్ స్పష్టం చేసింది. ఒకవేళ మార్పులు జరిగినా హెచ్1బీ వీసాదారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు మరో సెక్షన్ 106(ఏ)-(బీ)ద్వారా తాత్కాలిక రక్షణ లభిస్తుందని జొనాథన్ తెలిపారు. దీని ప్రకారం.. ఏడాదిపాటు హెచ్1బీ పొడిగింపు కోరుతూ ఆయా కంపెనీలు అభ్యర్థించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. తమపై ఎవరి ఒత్తిడీ లేదని అన్నారు.