Begin typing your search above and press return to search.

అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే..

By:  Tupaki Desk   |   30 March 2018 11:33 AM GMT
అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే..
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. వీసాల జారీకి వీలైన‌న్ని ష‌ర‌తులు విధిస్తున్న ట్రంప్ స‌ర్కారు ఆ జాబితాలో తాజాగా మ‌రో ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. వీసా దరఖాస్తుదారులు కఠినతరమైన ప్రశ్నలు ఎదుర్కొనేలా అదనపు విచారణ వారెంట్‌ను జారీ చేశారు. తాజా నిబంధ‌న‌ల‌ ప్ర‌కారం...అభ్యర్థులందరూ అన్ని పాస్‌ పోర్టు నెంబర్లను - 5 ఏళ్ల‌ విలువైన సోషల్‌ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్‌ అడ్రస్‌ లు - ఫోన్‌ నెంబర్లు - అదేవిధంగా 15 ఏళ్ల‌ బయోగ్రాఫికల్‌ సమాచారాన్ని అమెరికా వీసాకోసం దరఖాస్తు చేసే ముందు సమర్పించాల్సి ఉంటుందని తాజా ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు.

ట్రంప్ ప్రభుత్వం వీసా జారీని మరింత కఠినతరం చేసిన ఈ నిబంధ‌న‌ల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇప్పుడు తమ సమాచారాన్ని పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. పాత ఫోన్ నెంబర్లతో సహా ఈ-మెయిల్ అడ్రెస్ - సోషల్ మీడియా హిస్టరీని కూడా అందజేయాలట. గత అయిదేళ్లుగా వాడిన ఫోన్ నెంబర్ల వివరాలు కూడా వెల్లడించాలని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో ఏ ఫ్లాట్‌ ఫామ్‌ ను వాడుతున్నారో కూడా తెలుపాల్సి ఉంటుంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాన్ ఇమ్మిగ్రాంట్ వీసాతో అమెరికా రావాలనుకున్న వాళ్లు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని ఫెడరల్ రిజిస్టర్‌ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్‌ లో తెలిపారు. నూతన వీసా విధానం వల్ల సుమారు ఏడు లక్షల మంది ఇమ్మిగ్రాంట్లపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

కాగా, తీవ్రవాదుల దాడులను నిరోధించేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావించిన అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు అమలుచేయాలని భావించి తాజా నిర్ణ‌యానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉందేమో తేల్చేందుకు సోషల్‌ మీడియా అకౌంట్ల విచారణ కూడా అందులో భాగమని వివ‌రిస్తున్నారు. ఒకవేళ వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది.