Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగుల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   25 Dec 2017 9:05 AM GMT
ఐటీ ఉద్యోగుల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన ట్రంప్‌
X
అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇబ్బందిక‌రంగా ఉంటున్నాయి. అమెరికాకు రావాల‌నుకునే విదేశీ ఉద్యోగుల‌పై ప‌రిమితుల్ని అంత‌కంత‌కూ పెంచుతున్న ఆయ‌న తీరుపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ తాను ఏమ‌నుకున్నానో దాన్నే ఫాలో అవుతున్న ఆయ‌న‌.. విదేశీ విధానాల‌పై సంస్క‌ర‌ణ‌ల్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు.

తాజాగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌నను చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాల‌ని వ‌చ్చే విదేశీ ఉద్యోగుల‌కు జారీ చేసే హెచ్ 1బీ వీసా జారీ విధానాన్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేయాల‌ని భావిస్తోంది. ఇందుకోసం అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యురిటీ విభాగం కొత్త ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేసింది. తాజా ప్ర‌తిపాద‌న‌ల్లో హెచ్ 1బీ వీసా పిటిష‌న్ దారుల ఎంపిక ప్ర‌క్రియ‌లో క‌ఠిన నిబంధ‌న‌ల్ని చేర్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదే విష‌యాన్ని అంత‌ర్జాతీయ ఇమ్మిగ్రేష‌న్ సంస్థ ప్రోగోమెన్ స్ప‌ష్టం చేసింది. ఈ సంస్థ చెబుతున్న దాని ప్ర‌కారం హెచ్ 1 బీ వీసా నిబంధ‌న‌ల‌పై 2011లో చేసిన ప్ర‌తిపాద‌న‌ను మ‌ళ్లీ పున‌రుద్ధ‌రించిన‌ట్లుగా పేర్కొంది. హెచ్ 1బీ వీసా కోసం క్యాప్ నంబ‌ర్లు ఇచ్చిన త‌ర్వాతే వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ నైపుణ్యం ఉన్న వారికి.. ఎక్కువ జీతం వ‌చ్చే వారికి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు.

ఈ కార‌ణంగా భారీ జీతాల‌కు ఎంపిక చేసే ఉన్న‌త ఉద్యోగులు మిన‌హా మిగిలిన వారికి ప్రాధాన్య‌త త‌గ్గ‌ట‌మంటే.. వారికి అవ‌కాశాలు త‌గ్గించ‌టంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే హెచ్ 1 బీ వీసా జారీ ప్ర‌క్రియ‌లో ప‌లు మార్పులు చేసిన నేప‌థ్యంలో.. తాజాగా మ‌రోసారి చేస్తార‌ని చెబుతున్న వార్త‌లు అమెరికాకు వెళ్లాల‌నుకునే వారికి చేదుమాత్ర‌లుగా మార‌తాయ‌న‌టంలో సందేహం లేదు.