Begin typing your search above and press return to search.

ఆపరేషన్ గరుడ పోయి ఆపరేషన్ నరుడ వచ్చింది

By:  Tupaki Desk   |   27 Oct 2018 5:29 PM GMT
ఆపరేషన్ గరుడ పోయి ఆపరేషన్ నరుడ వచ్చింది
X
చంద్రబాబు ఏం చేసినా చేయకపోయినా అప్పులు - ఆర్భాటాలు మాత్రం చేశారని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. దొంగ నాయకులు - వ్యాపారులపై ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు - ఆయన మంత్రులు ఎందుకు భయపడుతున్నారో.. వారిపై ఐటీ దాడులు జరిగితే వీరెందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే దొంగ సరకు కొనేవారిలా అనిపిస్తోందన్నారు. ఏపీలో ఒక జాతీయ పార్టీ ఆపరేషన గరుడ ప్లాన్ అమలు చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఏపీలో ఆపరేషన్ నరుడ జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా జీవీఎల్.. సీఎం రమేశ్‌ ను తెలుగు విజయమాల్యాగా అభివర్ణించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని టీడీపీ ప్రయత్నించిందని.. బీజేపీ అడ్డుకోవడంతో వెనక్కి తగ్గిందని చెప్పారు. హాయ్‌ ల్యాండ్‌ పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిల గిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమని, కానీ సీఎం మాత్రం కొంచెంకూడా సానుభూతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ వాళ్లు దాడిచేస్తే ఇలా ఉండదని ఒక మంత్రే అన్నారని.. ఇది ఎంతవరకు సబబో అర్థం కావడం లేదన్నారు. ఎయిర్‌ పోర్ట్‌ లో జరిగిన దానికి తమకు సంబంధం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్రంలో ఆపరేషన్‌ నరుడ అమలు చేస్తోందని జీవీఎల్ ఆరోపించారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జీవీఎల్ జోష్యం చెప్పారు.