Begin typing your search above and press return to search.

చంద్రబాబుది హైటెక్ కరప్షన్

By:  Tupaki Desk   |   8 Oct 2018 6:12 AM GMT
చంద్రబాబుది హైటెక్ కరప్షన్
X
చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైటెక్ అవినీతికి పాల్పడుతోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. టీవీ9 చానల్‌లో ‘ఎన్‌ కౌంటర్ విత్ మురళీకృష్ణ’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చద్రబాబు, తెలుగుదేశం పార్టీ - ఏపీ ప్రభుత్వంపై విమర్శలు - ఆరోపణలు చేశారు. ప్రతి తెలుగుదేశం పార్టీ నేతా అడ్డగోలుగా అక్రమాలు చేసి సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజలకు వాస్తవాలు చెబుతుండడంతో తానంటే టీడీపీ నేతలు భయపడుతున్నారని.. అందుకే తనను శనితో పోల్చుతున్నారని.. కానీ, ఏపీకి పట్టిన చీడపురుగులు టీడీపీ నేతలని ఆయన అన్నారు. ప్రతి స్కీంలో ఒక స్కాం చేస్తున్నారని.. ఏపీ చరిత్రలోనే చంద్రబాబు ప్రభుత్వం వంటి అవినీతి ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ లేదని జీవీఎల్ ఆరోపించారు. ఆలస్యం అవుతుందేమో కానీ అవినీతి చేసినవారెవరైనా జైలు ఊచలు లెక్కపెడతారంటూ ఆయన చంద్రబాబును జైలుకు పంపించే ఉద్దేశం ఉందన్న సంకేతాలిచ్చారు.

కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా వాడుకోవాలో తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టత లేదని జీవీఎల్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని అనుకుంటోందని... అది కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బలం పుంజుకోవాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఏపీలో బీజేపీ పరిస్థితి జీరో కదా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన త్రిపుర వంటి చోట్ల జీరో నుంచి హీరో అయిన సందర్భాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అలాంటిదేమీ లేదని చెప్పినప్పటికీ ఒక రకమైన నర్మగర్భపు నవ్వు నవ్వడం కనిపించింది. తెలంగాణలో టీఆరెస్‌తో అవగాహనేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. టీఆరెస్‌కు ఒవైసీ పార్టీతో పొత్తు ఉందని... తమకు ఆ పార్టీలతో సంబంధం లేదని అన్నారు.

తెలుగు రాష్ట్రాల జరగబోతున్న ఎన్నికల్లో ఈసారి తాము లేకుండా ప్రభుత్వాల ఏర్పాటు సాధ్యం కాదని ఆయన చెప్పారు. 2024లో రెండు రాష్ట్రాల్లోనూ సొంతంగా అధికారంలోకి వస్తామని చెప్పారు.

రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల వెనుక తాము లేమని.. టీఆరస్ ఎంపీపైనా ఐటీ దాడులు జరిగాయన్న సంగతి ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు చేయించింది తామయితే మరి టీఆరెస్ ఎంపీ ఇంటిపై దాడులు చేయించింది ఎవరని ప్రశ్నించారు.