Begin typing your search above and press return to search.

రాజ‌ధాని భూముల‌తో వ్యాపారం..ల‌క్ష‌కోట్లు కూడ‌బెట్టిన టీడీపీ నేత‌లు

By:  Tupaki Desk   |   19 Nov 2018 10:21 AM GMT
రాజ‌ధాని భూముల‌తో వ్యాపారం..ల‌క్ష‌కోట్లు కూడ‌బెట్టిన టీడీపీ నేత‌లు
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ త‌న ఎదురుదాడిని మ‌రింత పెంచింది. బాబు అవినీతిని ఎండ‌గ‌ట్ట‌డం తీవ్రత‌రం చేస్తామంటూ ప్ర‌క‌టించి బీజేపీ తాజాగా విజయవాడలో భూ రక్షణ దీక్ష చేపట్టింది. బీజేపీకి చెందిన ముఖ్య‌నేత‌లు ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రై ఏపీ స‌ర్కారును టార్గెట్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి - ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వంగా మారిపోయిందని విమ‌ర్శించారు. అమరావతి పేరుతో తెలుగు తమ్ముళ్లు ప్రజల భూములను - సొమ్మును దోచేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో ఎకరం భూమి రూ.4-5 కోట్లు పలుకుతుంటే - ఇక్కడ టీడీపీ నేతలు మాత్రం రూ.10 లక్షలకే దక్కించుకున్నారని భారీ కుంభకోణానికి తెరతీశారన్నారు. ఇలా 25,000 ఎకరాలను టీడీపీ నేతలు దక్కించుకోవ‌డం దాదాపు రూ.1,00,000 కోట్లను అమరావతిలో టీడీపీ నేతలు దాచుకున్నారని ఆరోపించారు.

అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ప్రజల భూములను అధికార పార్టీ నాయకులు దోపిడీ చేశారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. లక్షల కోట్ల అవినీతి సంపాదన కోసమే అమరావతిని చంద్రబాబు నిర్మిస్తున్నారని భ‌గ్గుమ‌న్నారు. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లకు అమరావతి స్విస్ బ్యాంకుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఏపీ ప్రజలు మేల్కోకుంటే అమరావతిని చూడటానికి చంద్రబాబు టికెట్ పెడతారనీ - ప్రజలు చెల్లించిన డబ్బుతో నిర్మాణాలు చేపడతారని పేర్కొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని జీవీఎల్ న‌ర‌సింహారావు వెల్ల‌డించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా భూరక్షణ దీక్ష చేపట్టామని చెప్పారు. బ్రిటీష్ వాళ్లు గతంలో ఏవిధంగా దేశ ప్రజలను హింసించారో...టీడీపీ నేతలు అంతకుమించి రాజధాని రైతులను హింసిస్తున్నారని ఆరోపించారు. రాజధాని భూములతో వ్యాపారం చేస్తున్నారని...రాజధానిలో జరిగిన భూ కుంభకోణం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని మండిప‌డ్డారు. అమరావతి భూములను సీఎం చంద్ర‌బాబు బంధువులు, నాయకులు కొనుగోలు చేసిన తర్వాతే రాజధాని ప్రాంతంగా ప్రకటించారని.. సీఎం తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉన్నదని కన్నా అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉన్నదని అన్నారు. సీఎంకు ధనదాహం, భూదాహం పట్టుకుందని.. విశాఖపట్నం భూకుంభకోణంలో వేల కోట్ల దోపిడి జరిగిందని స్వయంగా వారి మంత్రే చెప్పారని కన్నా గుర్తు చేశారు.