Begin typing your search above and press return to search.

హోదాను వ్య‌తిరేకిస్తున్న ఏకైక `ఆంధ్రావాలా`!

By:  Tupaki Desk   |   24 July 2018 2:17 PM GMT
హోదాను వ్య‌తిరేకిస్తున్న ఏకైక `ఆంధ్రావాలా`!
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డ్డ అవ‌శేషాంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఏపీకి చెందిన తెలుగు ఎంపీలంద‌రూ ముక్త‌కంఠంతో త‌మ వాణిని పార్ల‌మెంట్ లో వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంటు వెలుప‌ల‌ - లోప‌ల ర‌క‌ర‌కాలుగా తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం కోసం ఎంపీలంతా పార్టీల‌క‌తీతంగా పోరాడుతున్నారు. ఏపీకి హోదా కావాల్సిందేన‌ని ఏపీలో బీజేపీ మిన‌హా అన్ని పార్టీలు అనేక ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలిపాయి. తాజాగా - ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా కూడా....ఏపీకి చెందిన తెలుగు ఎంపీల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప‌లు పార్టీల ఎంపీలు కూడా హోదాకు మ‌ద్దతిచ్చారు. కానీ, ఇంత‌మంది ఏపీకి హోదా కావాల‌ని మ‌ద్ద‌తిస్తున్నా.....ఒకే ఒక్క తెలుగు ఎంపీ మాత్రం....ఏపీకి హోదాను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పుట్టిపెరిగాన‌ని....తెలుగు వాడినైనందుకు గ‌ర్వ‌ప‌డ‌తాన‌ని చెప్పుకునే ఆ నేత‌....హోదా విష‌యంలో మాత్రం ఆ ఒక్క‌టీ అడ‌క్కు అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో న‌వ్యాంధ్రప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గుర‌వుతున్న ఆ నేత మ‌రెవ‌రో కాదు...బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహా రావు.

బీజేపీ త‌ర‌ఫున జీవీఎల్ న‌ర‌సింహా రావు.రాజ్య‌స‌భ ఎంపీగా నామినేట్ అయ్యారు. అయితే, ప్ర‌స్తుతం జీవీఎల్ తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాను తెలుగు బిడ్డ‌న‌ని - ఆంధ్రాలో పుట్టినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని ప‌లుమార్లు జీవీఎల్ నొక్కివ‌క్కాణించారు. అయితే, ఏపీకి హోదా విష‌యంలో మాత్రం అంద‌రికన్నా భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జాగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ఓ ప‌క్క హోదా కోసం....ఎంపీలంతా పార్టీల‌క‌తీతంగా.. పోరాడుతుంటే...ఈయ‌న మాత్రం....హోదాకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా, ఏపీకి ఏ పార్టీ చేయ‌నంత సాయం బీజేపీ చేసింద‌ని త‌మ పార్టీని వెన‌కేసుకువ‌స్తున్నారు. అంతేకాద‌ట‌...ఆంధ్ర‌ప్ర‌జ‌లు సానుకూల దృక్ప‌థంతో ఉండాల‌ని కూడా జీవీఎల్ పిలుపునిచ్చారు. అస‌లే, ఏపీకి హోదా ఇస్తాన‌ని మోసం చేసిన మోదీ స‌ర్కార్ పై ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో జీవీఎల్ వ్యాఖ్య‌లు అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. మ‌రి, హోదాను వ్య‌తిరేకిస్తున్న `ఒకే ఒక్క‌డు` జీవీఎల్ `ఆంధ్రావాలా`ల మ‌నోభావాల‌ను గుర్తించ‌క‌పోతే రాబోయే రోజుల్లో వారి ఆగ్ర‌హాన్ని చ‌విచూడ‌క త‌ప్ప‌దు.