Begin typing your search above and press return to search.

జీవీఎల్ కు కోపమొచ్చిందబ్బా... ఎవరెవరిపైనంటే?

By:  Tupaki Desk   |   6 March 2020 3:50 PM GMT
జీవీఎల్ కు కోపమొచ్చిందబ్బా... ఎవరెవరిపైనంటే?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ వ్యవహారాలపై తనదైన శైలిలో స్పందిస్తున్న నేతగా ముద్రపడిన జీవీఎల్ నరసింహారావుకు నిజంగానే కోపమొచ్చేసింది. గురువారం రాత్రి ఢిల్లీలో అత్యవసరంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడిన తీరు, తనపై వస్తున్న వ్యతిరేక వార్తా కథనాలపై ఆగ్రహించిన తీరు చూస్తుంటే... నిజంగానే జీవీఎల్ కు ఓ రేంజిలోనే కోపమొచ్చేసిందని చెప్పాలి. అయినా జీవీఎల్ కు కోపం ఎందుకు వచ్చింది? ఎవరిపై వచ్చింది? దానికి దారి తీసిన కారణాలేమిటి? అన్న విషయాలపై కాస్తంత లోతుగా ఆరా తీస్తే... ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆ కథాకమామీషు ఏమిటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి.

ఏపీకి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నవ్యాంధ్ర రాజదానిగా కొనసాగుతున్న అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు పరిమితం చేసేసి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో, జ్యుడిషియల్ కేపిటల్ కర్నూలులో పెట్టనున్నట్లుగా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా... బీజేపీ ఏపీ చీఫ్ గా వ్యవహరిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ కూడా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో మొన్నటిదాకా టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని, ఈ విషయంలో కేంద్రం తప్పనిసరిగా జోక్యం చేసుకుంటుందని కూడా సుజనా ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదేనని, ఈ విషయంలో కేంద్రం జోక్యం అస్సలు ఉండదని కూడా జీవీఎల్ చెప్పుకొస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో జీవీఎల్ పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఓ రేంజిలో ప్రచారం మొదలైపోయింది. టీడీపీ అనుకూల మీడియా ఈ విషయంపై పెద్ద ఎత్తున కథనాలు రాస్తోంది. అంతేకాకుండా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా.. జీవీఎల్ కు ఫుల్ క్లాస్ తీసుకున్నారని, వైఖరి మార్చుకోవాలని ఏకంగా వార్నింగే ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చూసినంతనే జీవీఎల్ ఆగ్రహోదగ్రులయ్యారట. ఈ కథనాల వెనుక టీడీపీతో పాటు తన సొంత పార్టీ నేతల హస్తముందన్న భావనకు వచ్చేసిన జీవీఎల్ గురువారం రాత్రి అత్యవసరంగా మీడియా మీట్ ను నిర్వహించారట. ఈ సమావేశంలో తనపై తప్పుడు కథనాలు రాస్తున్న మీడియా సంస్థలపై ఓ రేంజిలో ఫైర్ అయిన జీవీఎల్... సొంత పార్టీ నేతల తీరుపైనా విరుచుకుపడ్డారు. అసలు తాను మాట్లాడేది బీజేపీ అధిష్ఠానం నిర్దేశాల మేరకేనని జీవీఎల్ చెప్పుకొచ్చారు. అమరావతి విషయంలో జోక్యం చేసుకోబోమని బీజేపీ సర్కారు ఏకంగా పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటనను కూడా ఈ సందర్బంగా జీవీఎల్ ప్రస్తావించారు.

అంతేకాకుండా తనపై తప్పుడు కథనాలు రాయిస్తున్న వారి పనిబడతానని, అదే సమయంలో తప్పుడు కథనాలు రాయడం మానని పక్షంలో సదరు కథనాలు రాస్తున్న మీడియా సంస్థల పనిబడతానని కూడా జీవీఎల్ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా తనపై తప్పుడు కథనం రాసిన ఓ పత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే సదరు సంస్థపై పరువు నష్టం దావా వేస్తానని కూడా జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సొంత పార్టీ నేతలు అంటూ జీవీఎల్ ప్రస్తావించిన నేతలు అటు కన్నాతో పాటుగా ఇటు సుజనాలేనన్న అర్థం వచ్చేలా కూడా జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశాలు, అభిమతం తెలియకుండా మాట్లాడుతున్న వారు ఇకనైనా సర్దుకోవాలంటూ జీవీఎల్ సున్నితంగానే హెచ్చరికలు జారీ చేశారు. మరి జీవీఎల్ ఆగ్రహం చూసిన తర్వాత అయినా కన్నా గానీ, సుజనా గానీ అమరావతి విషయంలో తగ్గుతారో? లేదో? చూడాలి.