Begin typing your search above and press return to search.

తెలంగాణలో మళ్లీ మరో ఉప ఎన్నిక?

By:  Tupaki Desk   |   5 Jun 2016 6:02 AM GMT
తెలంగాణలో మళ్లీ మరో ఉప ఎన్నిక?
X
పిల్లలకు పరీక్షలు ఎలానో.. రాజకీయ అధినేతలకు ఎన్నికలు అన్న మాటే చిరాకు తెప్పిస్తాయి. విద్యార్థులకు ఏడాదికి ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ మాదిరి.. రాజకీయ పార్టీలకు ఐదేళ్లకోసారి ఎన్నికల ఎగ్జామ్స్ కే కిందామీదా పడిపోయే పరిస్థితి. అలాంటిది సరాసరిన ఆర్నెల్లకో ఉప ఎన్నిక చొప్పున రెఢీ కావటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది. ఉప ఎన్నిక అంటే అషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కసరత్తు అవసరం. పక్కా వ్యూహం తప్పనిసరి. తుది ఫలితం ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే.. వీలైనంతవరకూ సేఫ్ గేమ్ ఆడేందుకే అధినేతలు ఇష్టపడుతుంటారు. అదే పనిగా ఉప ఎన్నికలు మీదేసుకోవటానికి ఒక పట్టానా ఓకే చెప్పరు. ఒకవేళ అనుకోకుండా వచ్చి పడే ఉప ఎన్నికల్ని వీలైనంత వరకూ ఏకగ్రీవం చేయటం మీదనే దృష్టి పెడుతుంటారు. తరచూ ఉప ఎన్నికలు పాలన మీద ఫోకస్ చేయటానికి ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ.. ఇలాంటి వాటికి పూర్తి భిన్నం తెలంగాణ సీఎం కేసీఆర్.

ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ రెండేళ్ల కాలంలో రాజ్యసభ.. ఎమ్మెల్సీ.. స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా చాలానే ఎదుర్కొన్నారు. కొన్ని ఉప ఎన్నికల్లో అయితే సంప్రదాయానికి భిన్నంగా అడుగులు వేశారు. అయితే.. అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన ఊహించిన దానికి భిన్నమైన ఫలితం వచ్చింది.

మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాధించటం అంత చిన్న విషయం కాదు. మాజీ మంత్రి.. కాంగ్రెస్ కు కంచుకోట లాంటి చోట.. దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయం ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటున్నారు. ఇదే రీతిలో ఎన్నికను ఏకగ్రీవం చేయటానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నించినా.. అలాంటి అవకాశం ఇవ్వని కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ఉప ఎన్నికకు వెళ్లటమే కాదు.. ఘన విజయంసాధించటం గమనార్హం.

ఇలా ఉప ఎన్నికలకు ఏ మాత్రం వెరవని ఆయన తాజాగా మరో ఉప ఎన్నికకు సిద్ధం కానున్నారా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా కారు ఎక్కటానికి రెఢీ కావటం.. పార్టీ మారే సమయంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో గుత్తా ఉండటమే కారణంగా చెప్పాలి. ఉప ఎన్నిక విషయంలో కాస్త తటపటాయించిన కేసీఆర్.. ఆ వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎంపీగా ఉన్న తాను పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే జాతీయ స్థాయిలో చర్చకు అవకాశంతో పాటు.. డిస్ క్వాలిఫై అయ్యే ప్రమాదం పొంచి ఉందని.. దాని కంటే పదవికి రాజీనామా చేయటమే ఉత్తమం అని.. తనకు మాట అనిపించుకోవటం ఇష్టం లేదన్న గుత్తా మాటకు కేసీఆర్ ఓకే చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గుత్తా కారు ఎక్కటమంటే.. నల్గొండ ఎంపీ స్థానానికి మరో ఉప ఎన్నిక పక్కా అయినట్లేనని చెప్పక తప్పదు. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రెండు వారాల వ్యవధిలోనే పార్టీ మారాలన్న ఆలోచనలో గుత్తా ఉన్నారు. అదే జరిగితే.. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయటం ఖాయం. రాజీనామా ఆమోదం పొందిన నాటి నుంచి ఆర్నెల్ల వ్యవధిలో ఉప ఎన్నికను నిర్వహించాల్సిన నేపథ్యంలో ఏడాది చివరి లోపల మరో ఉప ఎన్నిక జరగటం ఖాయం. మొత్తంగా చూస్తే.. స్వల్ప వ్యవధిలో ఎదురవుతున్న ఉప ఎన్నికలకు వెరవకుండా ఓకే అనటం చూసినప్పుడు కేసీఆర్ ఆత్మవిశ్వాసం అబ్బురమనిపించక మానదు.