Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డికి అంత సీన్ లేదట‌

By:  Tupaki Desk   |   11 July 2016 2:19 PM GMT
కోమ‌టిరెడ్డికి అంత సీన్ లేదట‌
X
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై టీఆర్‌ ఎస్ నేత - ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని గుత్తా మండిపడ్డారు. వెంకట్‌రెడ్డి తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చాననడం హాస్యాస్పదంగా ఉందని, త‌నపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజ‌కీయ జీవితం గురించి, పార్టీ మార‌డం గురించి తనపై చేసిన ఆరోపణలను వెంకట్‌ రెడ్డి నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సంద‌ర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్ర‌సంగిగిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగానే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కోమ‌టిరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పుణ్యమా అని పైసా ఖర్చులేకుండా గెలిచిన గుత్తా పార్టీ ఫిరాయించారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు - రిజర్వేషన్ల పేరుతో ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని అందులో గుత్తా భాగ‌స్వామ్యం అయ్యార‌ని ఆరోపించారు. దీనిపై తాజాగా స్పందించిన గుత్తా... ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి త‌గిన‌ట్లుగా వ్య‌వహ‌రించ‌డం కోమ‌టిరెడ్డిని చూసి నేర్చుకోవాల‌ని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ‌ద్ద శిష్య‌రికం చేసి రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉండాల్సిన అగ‌త్యం త‌న‌కు లేద‌న్నారు. త‌న‌కు, త‌న కుటుంబానికి రాజ‌కీయాలు కొత్త కాద‌ని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారడం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే అధికారంలో ఉన్న‌వారికి ద‌గ్గ‌ర‌గా ఎవ‌రుంటారో అంద‌రికీ తెలిసిందేన‌ని అన్నారు.