Begin typing your search above and press return to search.

ప్యాకేజీ కోసం గుత్తా గళం విప్పారండోయ్

By:  Tupaki Desk   |   8 Sept 2016 12:20 PM IST
ప్యాకేజీ కోసం గుత్తా గళం విప్పారండోయ్
X
హోదా కోసం గళం విప్పితే.. దాన్ని లైట్ తీసుకొని తమకు తోచినట్లుగా ప్యాకేజీ ప్రకటించిన మోడీ సర్కారుతో సీమాంధ్రుడు రగిలిపోతున్న పరిస్థితి. విభజన జరిగిన 27 నెలల తర్వాత హైరానా పడుతూ ప్రకటించిన ప్యాకేజీలో ‘విషయం’ ఏమీ లేదన్న సంగతి తెలిసిందే. ఏపీకి ఏదో చేస్తున్నట్లుగా కేంద్రం బిల్డప్ తప్పించి ఏపీకి ప్రయోజనం కలిగించే అంశాలేవీ లేవు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై రాజకీయ పక్షాలు మొదలు.. సామాన్యుడి వరకూ అందరూ ఫీల్ అవుతున్న వేళ.. ఏపీకి ఇచ్చిన ప్యాకేజీని ప్రస్తావిస్తూ తెలంగాణ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం ఎంతన్నది అందరికి తెలిసిందే. దానికి ఇప్పటివరకూ సరైన పరిహారం జరగని నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి సీమాంధ్ర కూరుకుపోయింది. దీనికి పరిష్కారం లభించక తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారికి తాజాగా జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ ఎంగిలి మెతుకుల్లాంటిదన్న భావన వ్యక్తమవుతోంది.

అరకొర ప్యాకేజీ ఇచ్చేసి.. అసలైన హోదాకు ఎసరు పెట్టిన వేళ.. ఆ విషయాన్ని పట్టించుకోని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణకూ ప్యాకేజీ ప్రకటించాలనటం శోచనీయం. తెలంగాణ ప్రయోజనాలకోసం పోరాటంలో తప్పు లేదు. కానీ.. ఏపీకి ఇచ్చిన ప్యాకేజీని ప్రస్తావిస్తూ.. ఏపీ విభజన చట్టం రెండు రాష్ట్రాలకు సంబంధించిందని.. అందులో తెలంగాణలోని ఆర్థిక.. సామాజిక సమస్యల్ని ప్రస్తావించారని.. వాటిని తక్షణమే ప్రకటించాలంటూ డిమాండ్చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి వారు తమ ప్రయోజనాల కోసం పోరాడటంలో తప్పు లేదు.కానీ.. ఒకరిని చూపించి.. వారి మాదిరి తమకూ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయటంతోనే అసలు సమస్య. ఒకవేళ.. ఇలాంటి పోలికే పెట్టదలుచుకుంటే.. ఏపీకి ఇవ్వాల్సిన హోదా గురించి కూడా గుత్తా గళం విప్పితే బాగుంటుంది. మొత్తంగా ముంచేసి.. కంటితుడుపుగా ఇస్తున్న ప్యాకేజీ విషయంలోనూ పోటీ పడి.. ఏపీకి ఇస్తున్నది తెలంగాణకూ ఇవ్వాలని అనటం సరైనది కాదన్న విషయాన్ని గుత్తా గుర్తించాలన్న అభిప్రాయాన్ని సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నారు. విభజనతో ఆరిపోయిన ఏపీతో సంపన్న రాష్ట్రానికి చెందిన గుత్తా పోల్చుకోవటం ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది.