Begin typing your search above and press return to search.

డిగ్గీ సాబ్‌..గుత్తా మాట‌లు విన్నావా?

By:  Tupaki Desk   |   17 Jun 2016 5:49 AM GMT
డిగ్గీ సాబ్‌..గుత్తా మాట‌లు విన్నావా?
X
కాంట్రాక్టుల కోసమే టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లిన న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డిపై అన‌ర్హ‌త వేటు ప‌డేలా పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసిన కాంగ్రెస్ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్‌ చార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ కు గుత్తా అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చారు. ఏకంగా ఉప ఎన్నిక‌కు సిద్ధం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌ పార్టీలోని గ్రూపు తగాదాలు - ఆధిపత్య పోరు తనను బాధపెట్టాయని - ఈ విషయాల గురించి గతంలోనే దిగ్విజయ్‌ సింగ్‌ కు లేఖ ద్వారా తెలియజేసినట్టు గుర్తు చేశారు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజీనామా గురించి చెప్పారు.

'సమయాన్ని బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేయక తప్పదు. నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. నా రాజీనామా కోరే వారు ఆ ఎన్నికల్లో దమ్ముంటే పోటీ చేసి గెలవొచ్చు. మాది కాంట్రాక్టులు చేసే సంస్కృతి ఉన్న కుటుంబం కాదు. మా వియ్యంకుడు నిజాం కాలం నుంచే కాంట్రాక్టులు చేస్తూ వస్తున్నాడు. దానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు' అని గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వీడుతున్న విషయాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకుల్లో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి మినహా అందరికీ చెప్పానని గుత్తా వివ‌రించారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని చూసి మాత్రమే ఆ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. యుపీఏపై అవిశ్వాస తీర్మానం సమయంలో టీడీపీ ఎంపీ ఆదికేశవనాయుడు సహకారం తీసుకున్నప్పుడు రాజకీయ నీతి ఏమైందో దిగ్విజయ్‌ చెప్పాలన్నారు. రూ.500 కోట్లకు అమ్ముడు పోయినట్టు కాంగ్రెస్‌ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి విమర్శ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మాదిరి ఎంపీ నిధుల్ని అమ్ముకునే సంస్కృతి తనకు లేదన్నారు. పనికి మాలిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించాడని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు తనను రాజీనామా చేయాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. కుడి భుజంగా పని చేసి సీనియ‌ర్ నేత జానారెడ్డితో విడిపోవడం బాధగా ఉందన్నారు.

ఇదిలాఉండ‌గా...ఎవరైనా సరే ఎక్కడైనా సరే తాను డబ్బులు తీసుకుని అమ్ముడు పోయినట్టుగా రుజువు చేస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు స్పష్టం చేశారు. తాను డబ్బులు - కాంట్రాక్టుల కోసం పార్టీ మారినట్టు విమర్శలు చేస్తున్నారని, ఇది బాధాకరమైన విషయమన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ - మిర్యాలగూడను నల్లగొండలో కలిపే విషయాల్లో సీఎం కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చినందునే తాను టీఆర్‌ ఎస్‌ లో చేరినట్టు తెలిపారు. లైసెన్స్‌ లే లేనప్పుడు కాంట్రాక్టులు ఎలా చేస్తామో అర్థం కావట్లేదన్నారు.